టాలీవుడ్‌కి చెందిన ఓ యంగ్ హీరోతో కథానాయిక మీనాక్షి చౌదరి ప్రేమలో ఉందని, త్వరలో వారిద్దరు పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే వీటిపై ఆమె టీమ్ ఇప్పటికే స్పష్టతనిచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి పుకార్లపై మీనాక్షి చౌదరి మాట్లాడింది.
తన కెరీర్ ఇప్పుడే ఓ ట్రాక్‌లోకి వచ్చిందని, పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అస్సలు లేదని స్పష్టం చేసింది. పెళ్లి గురించిన పుకార్లు విని అలసిపోతున్నానని, ఇకనైనా వాటికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరింది. ‘ఎక్కడకు వెళ్లినా పెళ్లెప్పుడనే ప్రశ్నే అడుగుతున్నారు. నేను ఎవరితో డేటింగ్ చేయట్లేదు.
ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. మరికొన్నేళ్లపాటు సినిమాలపైనే దృష్టిపెడతాను. నిజంగా పెళ్లి చేసుకునే సమయం వస్తే ఆ విషయాన్ని నేనే ముందుగా తెలియజేస్తా’ అని మీనాక్షి చౌదరి వివరణ ఇచ్చింది. ఈ భామ త్వరలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నది.