Maya Sabha | టాలీవుడ్ దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ మయసభ. ఆయనతో పాటు కిరణ్ జయ్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అప్పటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR). ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN)ల పాత్రలను ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. ఇందులో తమిళ నటుడు ఆది పినిశెట్టి నాయుడి పాత్రలో నటిస్తుండగా.. కీడాకోలా సినిమాతో అలరించిన చైతన్య రావు రెడ్డి పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ వేదిక సోని లివ్‌లో నేటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి) అనే ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన యువకుడు చిన్నప్పటినుంచే రాజకీయాలంటే ఎంతో ఆసక్తిని కలిగి ఉంటాడు. ప్రజలకు సేవ చేయాలనే బలమైన కోరిక అతనిలో ఉన్నా, కుటుంబం నుంచి మాత్రం పెద్దగా మద్దతు లభించదు. మరోవైపు, డాక్టర్ అయిన రామిరెడ్డి (చైతన్య రావు) తన తండ్రి బాంబుల శివారెడ్డి (శంకర్ మహంతి) రాయలసీమలో చేసే రౌడీయిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు. ఇలా భిన్న నేపథ్యాలు ఉన్న కృష్ణమ నాయుడు, రామిరెడ్డి అనుకోకుండా కలుసుకుని మంచి స్నేహితులుగా మారతారు. వీరి స్నేహం రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఎలాంటి మలుపులు తిరిగింది? దేశంలో ఎమర్జెన్సీ విధించిన అప్పటి ప్రధాని ఐరావతి బసు (దివ్యా దత్తా) నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాయి? అగ్ర కథానాయకుడైన రాయపాటి చక్రధర్ రావు (సాయి కుమార్) ఆ సమయంలో ఎలాంటి కీలక పాత్ర పోషించారు? కృష్ణమ నాయుడు ఆయనకు అల్లుడిగా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ఈ రాజకీయ చదరంగంలో తెర వెనుక చక్రం తిప్పింది ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్.