Matti Katha | సినీ పరిశ్రమ.. పల్లెల వెంట పడుతున్నది. గ్రామీణ నేపథ్యంలో.. తెలంగాణ యాసభాషలకు పట్టం కడుతున్నది. ఆ ఇతివృత్తాలకు ప్రేక్షకాదరణా లభిస్తున్నది. తాజాగా.. తాండూరు బిడ్డ పవన్ కడియాల తెరకెక్కించిన ‘మట్టికథ’.. మట్టి మనుషుల గుండెను తడిమింది. విడుదలకు ముందే తొమ్మిది అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఆ సినిమా నేపథ్యం, తన సినీ ప్రయాణం గురించి.. పవన్ అంతరంగం.
మాది వికారాబాద్ జిల్లా తాండూరు. నాకు చిన్నప్పటి నుంచే రాయడం అంటే ఇష్టం. సినిమాలపై ఆసక్తి ఉండేది. కానీ, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు నన్ను ఉద్యోగం వైపు నడిపించాయి. కొలువులో చేరిన తర్వాతే.. సినిమాల వైపు మళ్లాను. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించాను. వాటికి మంచి స్పందన రావడంతో.. సినిమాలపై దృష్టిపెట్టా.
అలనాటి నేపథ్యం..
‘మట్టికథ’ 2003లో పుట్టింది. అప్పటికి ఔటర్ రింగ్‌రోడ్డు వస్తుందని ఎవరికీ తెలియదు. అదంతా ముందే పసిగట్టిన కొందరు.. నా మిత్రుని వ్యవసాయ భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ రావడం.. భూముల ధరలు ఆకాశానికి అంటడం.. తెలిసిందే! ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకొనే.. ‘మట్టికథ’ రాసుకున్నా. విషాదం ఏమిటంటే.. హైదరాబాద్ చుట్టుపక్కల పల్లెల్లో ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి.
కష్టాలు కామన్
ఇండస్ట్రీలో సినిమా కష్టాలు సాధారణమే. నేనూ స్క్రిప్ట్ పట్టుకొని ఎన్నో ప్రొడక్షన్ హౌజ్‌ల చుట్టూ తిరిగాను. ఎంతోమంది నిర్మాతలను కలిశాను. 8 నెలలు తిరిగాక.. నిర్మాత అప్పిరెడ్డి ముందుకొచ్చారు. 70 లక్షల బడ్జెట్‌తో ‘మట్టికథ’ తెరకెక్కించాం. సహజత్వం దెబ్బతినకూడదనే.. తెలంగాణ భాషపై పట్టు ఉన్నవారినీ, స్థానికులనూ తీసుకున్నాం. బీబీనగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. విడుదలకు ముందే అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్నది మా మట్టి కథ. ఇండో-ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పలు విభాగాల్లో తొమ్మిది బహుమతులు గెలుచుకున్నది. బెస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫీచర్ ఫిల్మ్, డెబ్యూ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్ తదితర కేటగిరీల్లో అవార్డులు వరించాయి. సినిమా ట్రైలర్ చూసి, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ చిత్ర బృందాన్ని అభినందించారు. ఇక మరిచిపోలేని అనుభవం.. మంత్రి హరీశ్‌రావు ప్రశంస. స్వయంగా సినిమా చూసి మమ్మల్ని మెచ్చుకున్నారు.
తెలంగాణ – కమర్షియల్!
‘తెలంగాణ’ నేపథ్యం అనగానే.. అందరూ చిన్న సినిమాగానే చూస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లోనూ కమర్షియల్ సినిమాలు తీయొచ్చు. మన భాష, మన సంస్కృతిని చూపిస్తూనే.. పెద్ద హీరోలతో, భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించొచ్చు. ‘దసరా’ సినిమా.. ఆ కోవకు చెందిందే. ఎవరూ స్పృశించని కథను, తక్కువ బడ్జెట్లోనూ ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దవచ్చు.
‘బలగం’ సినిమా చేసింది అదే. హీరో మన భాష మాట్లాడినంత మాత్రాన.. అది తెలంగాణ సినిమా కాదు. సినిమాలో తెలంగాణ ఆత్మ కనిపించాలి. ఇక్కడి మట్టి పరిమళం గుప్పుమనాలి. అప్పుడే అది అచ్చమైన తెలంగాణ సినిమా. మా ‘మట్టికథ’లో కనిపించేది అదే! ప్రతి ఫ్రేమ్‌లో తెలంగాణ ఆత్మ దర్శనమిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరూ.. ‘ఇది మా కథే!’ అని ఫీల్ అయ్యేంత ఆర్ద్రత ఉంటుంది.
ఒక టీహబ్ కావాలి
చిత్రసీమలో ఇప్పటికీ ఎంతోమంది కొత్తవాళ్లు అవకాశాల కోసం తిరుగుతున్నారు. మనుగడ కోసం కష్టాలు పడుతున్నారు. ‘ఒకే ఒక్క చాన్స్!’ అంటూ, నటీనటులు, దర్శకులు.. ప్రొడ్యూసర్లను బతిమాలు తున్నారు. వారిని ప్రోత్సహించేలా, వెండితెర కలల్ని నిజం చేసేలా.. కొత్తవారికి – పెద్ద నిర్మాతలకు అనుసంధానంగా ఏదైనా ప్లాట్‌ఫామ్ ఉంటే బాగుంటుంది. సినిమా పరిశ్రమకు టీహబ్లాంటి ఇంక్యుబేషన్ సెంటర్ కావాలి. అప్పుడే ‘ఫిల్మ్‌నగర్ కష్టాలు’ దూరమవుతాయి. నా విషయానికి వస్తే.. నేను కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే సినిమాలు చేస్తున్నాను. నిజమే రెండు పడవల మీద ప్రయాణం కష్టంగానే ఉంటుంది. అయినా, ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి.. ఎలాంటి ఇబ్బందీ లేదు.
అందరి బతుకు చిత్రం
పల్లెల్లో ప్రతి ఒక్కరికీ మట్టితో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. వారివారి స్థాయిలో.. ఒక్కొక్కరికీ ఓ కథ ఉంటుంది. అదే మా సినిమాలో చూపించాం. తెలంగాణ పల్లె సంస్కృతి, మట్టితో పెనవేసుకున్న పల్లెవాసుల జీవితాలు, వారి జీవన విధానం, భూమి-వ్యవసాయం, పొలమే ప్రాణమని భావించే రైతుల భావోద్వేగాలను ‘మట్టికథ’ ద్వారా తెరకెక్కించాం. ఈ సినిమా 90వ దశకంలో జరుగుతుంది. అప్పటి గ్రామీణ ఆటలు, విద్యా సంస్థల తీరు, బక్క రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కునే భూస్వాముల వ్యవహార శైలినీ స్పృశించాం. ఇక సినిమాల్లో పోలికలు కామన్. మా చిత్రాన్ని కూడా ‘బలగం’తోనే పోల్చారు. మరో ‘బలగం’ అంటూ మీడియాలో
కథనాలు ఇచ్చారు.
…? శ్రీనివాస్ చిల్ల