Varun Tej | మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వరుణ్‌తేజ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘మట్కా’ ఒకటి. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతున్నది. నవంబర్ 14న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ మంగళవారం ప్రకటించారు.
ఈ సందర్భంగా సెకండ్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. వరుణ్ ఈ పోస్టర్లో రెట్రో అవతార్‌లో సిగరెట్ కాలుస్తూ మెట్లపై నడుస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. 1958 నుంచి 1982 వరకూ అంటే.. 24ఏండ్ల పాటు సాగే పీరియాడిక్ డ్రామా ఇదని, ఇందులో వరుణ్ నాలుగు విభిన్న రూపాల్లో కనిపిస్తారని మేకర్స్ తెలిపారు.
నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.కిశోర్‌కుమార్, నిర్మాతలు: డాక్టర్ విజయేందర్‌రెడ్డి, తీగల, రజనీ తాళ్లూరి, నిర్మాణం: వైర ఎంటైర్టెన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటైర్టెన్మెంట్స్.