‘నేను ‘అన్వేషణ’ తీయడానికి ప్రేరణ హిచ్‌కాక్. ఆయన తీసిన 53 సినిమాలూ చూసిన వ్యక్తిని నేను. నా ఆఫీస్‌లో ప్రతి గోడపై ఆయన గుర్తులుంటాయి. సినిమాకు అవసరమైనవి మూడు. ‘స్క్రిప్ట్.. స్క్రిప్ట్.. స్క్రిప్ట్..’ అని చెప్పిన గొప్ప దర్శకుడు హిచ్‌కాక్. ఆయనపై పుస్తకం వేయాలనే ఆలోచనే అద్భుతం. పులగం చిన్నారాయణ, రవి పాడి గొప్ప పుస్తకం తీసుకొచ్చారు.
నాకు తెలిసి ఇండియాలో ఎవరూ చేయని ప్రయత్నమిది. ఇది మళ్లీ రీ ప్రింట్‌కి రావాలి.’అని ప్రఖ్యాత దర్శకుడు వంశీ అన్నారు. విశ్వవిఖ్యాత దర్శకుడు ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా, అలాగే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు పూర్తయిన సందర్భంగా హిచ్‌కాక్ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ.. ఐఆర్ఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు.
ఈ పుస్తకాన్ని దర్శకుడు వంశీ ఆవిష్కరించి, తొలి ప్రతిని దర్శకుడు హరీశ్శంకర్కి అందించారు. రెండో ప్రతిని నటుడు నాజర్‌కు అందజేశారు. తొలి ప్రతిని సంతోషం పత్రిక అధినేత సురేశ్ కొండేటి ఐదువేల రూపాయలిచ్చి కొనుగోలు చేశారు. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ డిజైన్ చేసిన ఈ బుక్ కవర్ పేజీ ఫ్రేమ్‌ని దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆవిష్కరించారు.
45మంది దర్శకులు, ఏడుగురు రచయితలు, పదిమంది జర్నలిస్టులు రాసిన 62వ్యాసాలు ఇందులో ఉన్నాయని రచయితలు పులగం, రవి పాడి తెలిపారు. ఇంకా దర్శకులు వీరశంకర్, చంద్రసిద్ధార్థ్, శివనాగేశ్వరరావు, కరుణకుమార్, వర ముళ్లపూడి, దేవిప్రసాద్, సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.