మాస్టర్ మహేంద్రన్ హీరోగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘వసుదేవసుతం’. వైకుంఠ్ బోను దర్శకుడు. ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ పాటను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘వసుదేవసుతం దేవం..’ అంటూ సాగిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా, మణిశర్మ స్వరపరిచారు.
పవన్, శృతిక ఆలపించారు. పల్లె వాతావరణంలో దేవాలయ నేపథ్యంలో ఈ పాట చిత్రీకరించారు. ఈ పాటలో హీరోహీరోయిన్లు చూడముచ్చటగా ఉంటారని, మనసుల్ని కట్టిపడేసేలా కలర్ఫుల్గా ఈ పాటను చిత్రీకరించామని మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్న ఈ సినిమాలో అంబికావాణి, జాన్ విజయ్, సురేశ్‌చంద్ర మీనన్, ఈశ్వరలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, శివన్నారాయణ, దువ్వాలి మోషన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: జిజ్జు సన్నీ, నిర్మాణం: రెయిన్బో సినిమాస్.