Ranveer Singh | టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తదుపరి ప్రాజెక్ట్ గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అఖండ, అఖండ 2 (తాండవం) చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన బోయపాటి, ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈయన ముంబైలో రణవీర్ సింగ్‌తో భేటీ అయ్యారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న బోయపాటి శ్రీను ముంబై వెళ్లొచ్చినట్లు సమాచారం. అక్కడ రణవీర్ సింగ్‌ను కలిసి ఒక భారీ యాక్షన్ స్క్రిప్ట్‌ను వినిపించారని, దానికి రణవీర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. గతంలో ప్రశాంత్ వర్మతో రణవీర్ సినిమా చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు బోయపాటి చెప్పిన హై-వోల్టేజ్ మాస్ సబ్జెక్ట్ రణవీర్‌కు బాగా నచ్చిందని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే బోయపాటికి ఇది కెరీర్లోనే అతిపెద్ద అవకాశం అని చెప్పాలి.
రణవీర్ లాంటి స్టార్‌తో సినిమా అంటే అది కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక బోయపాటి మార్క్ ‘ఊరమాస్’ యాక్షన్ మరియు రణవీర్ సింగ్ ‘ఎనర్జీ’ కలిస్తే వెండితెరపై పూనకాలు రావడం ఖాయం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వస్తే మాత్రం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ అని తెలుస్తుంది. రణవీర్ సింగ్‌తో గనుక సినిమా ఓకే అయితే, మైత్రీ మూవీ మేకర్స్ లేదా మరేదైనా టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది.