Maruva Tarama | ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం వంటి చిత్రాలతో పరిచయమైన నటుడు హరీష్ ధనుంజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం “మరువ తరమా”. అవంతిక, అతుల్య చంద్ర కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు, ‘RX 100’ వంటి సినిమాకు పాటల రచయితగా పనిచేసిన చైతన్య వర్మ నడింపల్లి దర్శకుడిగా పరిచయమయ్యారు. గిడుతూరి రమణ మూర్తి, NV విజయ్ కుమార్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్, సాంగ్స్‌తో యూత్‌లో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా గురువారం రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
రిషి (హరీష్ ధనుంజయ్), సింధు (అవంతిక), అన్వీ (అతుల్య చంద్ర) ఒకే ఆఫీస్‌లో పని చేస్తుంటారు. సింధును తొలిచూపులోనే ప్రేమిస్తాడు రిషి. మరోవైపు, అన్వీ కూడా రిషిని అమితంగా ప్రేమిస్తుంది, కానీ రిషికి సింధు అంటే ఇష్టమని తెలిసి తన ప్రేమను చెప్పకుండా దాచుకుంటుంది. అలా సింధు ప్రేమలో మునిగి తేలుతున్న రిషి ఆమె నుంచి ఎందుకు విడిపోయాడు? విడిపోయిన తర్వాత సింధు మళ్లీ ఎందుకు తిరిగి వచ్చింది? అన్వీ తన ప్రేమను చివరకు రిషికి చెప్పిందా? రిషి తల్లి (రోహిణి) అతనికి చెప్పిన మాట ఏంటి? అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి ఎమోషనల్ ముగింపు తీసుకుందనేది తెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రేక్షకులను కనెక్ట్ చేయడమే దర్శకుడికి కీలకం. ఆ విషయంలో దర్శకుడు చైతన్య వర్మ సక్సెస్ అయ్యాడు. తొలి సగంలో చెప్పుకోదగ్గ పెద్ద కథ లేకపోయినా, ప్రతీ సన్నివేశంలో పంచ్‌లతో, సహజమైన కామెడీతో ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. పాటలు కూడా కథకు తగ్గట్టుగా, వినసొంపుగా అనిపించాయి. ద్వితీయార్థాన్ని దర్శకుడు పూర్తిగా కథ, కథనాలపై దృష్టి పెట్టాడు. ప్రేక్షకులను ఎమోషనల్‌గా కథకు కనెక్ట్ చేయగలిగాడు. తెరపై పాత్రలు మాట్లాడుతుంటే, “అరె.. మన ఫ్రెండ్స్‌లో వాడికి కూడా ఇలానే జరిగింది కదా” అనిపిస్తుందంటే ప్రేక్షకుడు సినిమాకు ఎంతలా కనెక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా రోహిణి ఓ సందర్భంలో చెప్పే డైలాగులు – “అనుకున్నట్లు జరిగితే అది ప్రేమ ఎందుకు అవుతుంది?” అనేది దర్శకుడి కలం పదునుకు ఉదాహరణ. అలాగే, “అమ్మాయిల విషయంలో ఆప్షన్లు ఉంటాయి ఏమో కానీ, అమ్మ విషయంలో ఆప్షన్స్ ఉండవు” లాంటి మాటలు గుర్తుండిపోయేలా చేస్తాయి. మనకు తెలిసిన కథను అంతే అర్థవంతంగా, యదార్థ సంఘటనల ఆధారంగా నడిపించిన కథే ఈ ‘మరువ తరమా’.
నటీనటుల పనితీరు:
చూడడానికి చాలా బాగున్న హరీష్ నటనలో ఈజ్‌తో చేశాడు. యూత్‌ఫుల్ కథలకు బాగా సెట్ అవుతాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో నేచురల్ స్టార్ నానిని గుర్తు చేసాడు. సరైన కథలు ఎంచుకుంటే మంచి గుర్తింపు వస్తుంది. అవంతిక చాలా బాగా నటించి, ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకుంది. అతుల్య చంద్ర తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. రోహిణి కనిపించింది కాసేపైనా, కథలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పించింది. దినేష్ ఈ పాత్ర చేసిన నటుడు హిలేరియస్‌గా నవ్వించాడు.
సాంకేతిక పనితీరు
ఈ సినిమాకు ప్రధాన బలం మ్యూజిక్. విజయ్ బుల్గానిన్, హరీష్ అందించిన సాంగ్స్, బీజీఎం సూపర్బ్ అనే చెప్పాలి. డైలాగ్స్ కూడా రిలేటబుల్‌గా ఉండి దర్శకుడి స్ట్రెంత్ ఏంటో తెలుపుతాయి. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌లో ఫస్టాఫ్‌లో కొన్ని లోపాలు కనిపించాయి. నిర్మాణ విలువలు ఓకే స్థాయిలో ఉన్నాయి.
ఓవరాల్:
“మరువ తరమా” మెప్పించదగిన, భావోద్వేగభరితమైన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.
రేటింగ్: 2.75/5