Maruthi | ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దది చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి నుంచి దర్శకుడు మారుతి చేసిన ఒక వ్యాఖ్యపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే వివాదం మరింత ముదిరకముందే మారుతి స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో పరిస్థితి చల్లారింది. ‘ది రాజా సాబ్’ ఈవెంట్లో మారుతి మాట్లాడిన ఒక లైన్ వివాదానికి దారితీసింది. “నేను కాలర్ ఎగరేయమని చెప్పను… ప్రభాస్ కటౌట్‌కి అది చిన్న మాట” అని ఆయన అన్న వ్యాఖ్యను తప్పుగా అర్ధం చేసుకున్న ఎన్టీఆర్ అభిమానులు మారుతిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ఇటీవల ఎన్టీఆర్ తరచూ “కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తా” అని చెప్పడం నేపథ్యంలో, మారుతి మాటలు పరోక్షంగా ఎన్టీఆర్‌ని ఉద్దేశించే అన్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని గమనించిన మారుతి వెంటనే తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నాకు ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యం లేదని, ఆ మాటలు ఫ్లోలో వచ్చినవని, ఎవరైనా హర్ట్ అయ్యుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు.అలాగే, ఎన్టీఆర్ గారంటే నాకు ఎంతో గౌరవం. ఆయన ఫ్యాన్స్ ప్రేమను నేనెప్పుడూ రెస్పెక్ట్ చేస్తాను. నా మాటలను కంపారిజన్లా చూడకండి అని స్పష్టం చేశారు.
వాస్తవానికి మారుతి, ఎన్టీఆర్ మధ్య చాలాకాలం నుంచే మంచి అనుబంధం ఉంది. బయట కలిసినా, పరిశ్రమ ఈవెంట్లలోనైనా ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకుంటారు. కావాలనే ఎన్టీఆర్‌పై కామెంట్ చేయాల్సిన అవసరం మారుతికి లేదు. ఈవెంట్లో ఉత్సాహంలో చెప్పిన మాటలను అభిమానులు వేరే కోణంలో అర్థం చేసుకోవడంతో ఈ వివాదం అనవసరంగా పెద్దదైంది.వివాదం పెరగకముందే ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పడం, స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం మారుతి మంచి మనసుకి తార్కాణం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. స్టార్ హీరోల అభిమానుల మధ్య అనవసరంగా గొడవ జరగకుండా ఆయన వెంటనే స్పందించిన తీరుని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం మారుతి పూర్తి ఫోకస్ సంక్రాంతికి రిలీజ్ కానున్న ‘రాజా సాబ్’పై ఉంది.