సినారె కవిత్వం, గేయం ప్రగతిశీల మానవతా భరితం. నడిచిన మార్గం అభ్యుదయ పథం. కవిగా కవిత్వపు చివరి చరణం వరకూ… వ్యక్తిగా చివరిశ్వాస వరకు ఆయన దానిని ఆచరించారు. అత్తున్నత రాజ్యసభ సదస్యత మొదలు అనేక పదవులు వారు నిర్వహించినప్పటికీ అంతిమ చరణం వరకు తెలంగాణలోని సాదాసీదా పల్లెటూరు హనుమాజీ పేట వారసత్వమే అడుగడుగునా కనిపించేది. అత్యున్నత ‘జ్ఞానపీఠ పురస్కారం’ అందుకోగానే అనేక సంస్థలు సత్కారం కోసం తేదీలు అడగగా, ‘పుట్టినూరు హనుమాజీపేట ఆశీస్సుల తరువాతే అన్నీ’ అంటూ సున్నితంగా తిరస్కరించారు. అదీ సినారె అంటే! వీరిది నూరెకరాల వ్యవసాయ కుటుంబం. ‘ఋతుచక్రం’ మొదలుకుని అనేక కావ్యాల్లో సినారె వ్యవసాయ, రైతు పక్షపాతం కనిపిస్తుంది! కర్పూర వసంత రాయలు కావ్యంలో కుమారగిరి రెడ్డిని ‘పంటకుల పద్మసంపద్యోదుణి’ అన్న ప్రయోగం మనకు తెలిసిందే!
ధిక్కార స్వరానికి పర్యాయపదమై నిలిచిన ఉద్యమాల నేల తెలంగాణ సినారె పుట్టిల్లు. అందులోనూ క్రాంతి జనితమైన కరీంనగరంలో పుట్టారాయె. ఆ వాసనలు ఎక్కడికి పోతాయి… ఆ స్వరంతోనే ‘ఎవడిదిరా ఈ భూమి.. ఎవ్వడురా భూస్వామి/ దున్నేవాడిదె భూమి.. పండించే వాడే ఆసామి’ అని పలికిన సినారెకు కర్షకులపట్ల గల సహానుభూతి, కార్మికుల పట్ల ఉన్న గౌరవభావం ఏంటో తెలుస్తుంది. ఇట్లా ఒక్కటని కాదు రైతులు, వ్యసాయం, పల్లెల గురించి వందలాదిగా గీతాలను రాశారు. ‘ఓ.. ఓ.. పట్టండి నాగలి పట్టండి’, ‘గాలి అందరిదైతే నేల కొందరిదేనా/ కష్టం అందరిదైతే ఫలితం కొందరికేనా’ లాంటి మరికొన్ని గీతాలను చూడవచ్చు. ‘ఎవడిదిరా ఈ భూమి.. ఎవ్వడురా భూస్వామి’ గీతాన్ని 1976 ప్రాంతంలో ‘మనుషులంతా ఒక్కటే’ సినిమా కోసం రాశారు. ‘దున్నేవాడిదే భూమి’ ఆనాటికి గొప్ప నినాదమే కాదు, అనేక ‘సాయుధ’పోరాటలాలకు భూమికను ఇచ్చింది. తెలుగునేల మీద లక్షలాది మందిని ప్రభావితం చేసి అభ్యుదయ పథం వైపు.. సాయుధపోరాటం వైపు నడిపించింది. ఆ నినాదం భూమికగా వచ్చిన కింది చేతనాత్మక గీతాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
పల్లవి
అతను: ఎవడిదిరా ఈ భూమి
ఎవ్వడురా భూస్వామి
దున్నేవాడిదె భూమి
పండించే వాడే ఆసామి
చరణం
అతను: కార్మికులే సమ్మె చేస్తే మిల్లులు గిల్లులు బందు
ఆమె: డ్రైవర్లే సమ్మె చేస్తే రైళ్లు, బస్సులు బందు
అతను: మరి రైతులందరూ సమ్మె చేస్తే…
గుప్పెడు మెతుకులు బందు
ఆ గుప్పెడు మెతుకులు పుట్టనినాడు
గొప్పోళ్ల డొక్కలు తదిగిణతోం ॥ఎవడిదిరా॥
ఆది నుంచి సినారెను, ఆయన కవిత్వాన్ని దగ్గరగా చూసినవాళ్లకు వారి ప్రతిరచనలో నిలిచిన సమన్వయ దృక్పథం, ప్రగతిశీల మానవతా వాదం కనిపిస్తాయి. ఈ గీతం ప్రగతిశీల మానవతావాదానికి ఎత్తిన పతాకలా వినిపిస్తుంది. మొదట రైతులు, కార్మికులు, కర్షకుల పక్షాన నిలిచిన కవి వారి గొంతుకగా ఇక్కడ కనిపిస్తారు. కార్మికులు, డ్రైవర్లు సమ్మె చేస్తే జీవనయానం స్తంభిస్తుందని, అదే అన్నం పెట్టే రైతన్న సమ్మె చేస్తే నోట్లోకి ‘మెతుకులు’ ఉండవని చెబుతూ… దానివల్ల ఇబ్బందిపడేది గొప్పోళ్లే అని తేలుస్తారు.
ఆరుగాలం కష్టపడి దుక్కిదున్ని పంట పండించిన రైతన్న నిత్యం ఏదో ఒక విధంగా మోసపోవడం ఈనాటికి మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి కాలం కలిసిరాక పంటలు పాడైపోతే, మరోసారి మందుల రూపంలో పంట నాశనం అవుతుంది. అన్నీ బాగుంటే ఆసామి అప్పు కింద సగం పోతుంది. ఇవన్నీ తట్టుకుని నిలిచి పంట చేతికొస్తే సరైన మద్దతు ధర రాక రైతు నిలువునా కూలిపోతున్నాడు. ఇందులోని రెండో చరణంలో మరింత ముందుకు వెళ్లి సమాజానికి శాపంగా మారి ధాన్యాన్ని దాచిపెట్టే.. దోపిడీదారుల గురించి నర్మగర్భంగా, ధ్వనిమయంగా చెబుతారు. వాళ్లను తీవ్రంగా నిరసిస్తూ పందికొక్కులు, చీడ పురుగులుగా వర్ణిస్తారు కవి సినారె. తిండి గింజలను దాచిపెట్టి, కృత్రిమ కొరతను సృష్టించే వర్గం అటు రైతుకు, ఇటు వ్యవస్థకు ఎంత శాపమో మనకు తెలుసు. కవి సినారె దానిని కూడా ఈ గీతంలో స్వష్టంగా చెబుతారు.
చరణం
అతను: పచ్చని పైరుల తెగ కొరికే
చీడ పురుగులుంటాయి..
ఆమె: తిండి గింజలను పొట్టపెట్టుకొను
పందికొక్కులూ.. ఉంటాయి
అతను: ఆ చీడపురుగులను దులిపేసి
ఆమె: ఆ పందికొక్కులను తరిమేసి
అతను: నలుగురొకటిగా నిలవాలి
మన రైతుల పరువులు నిలపాలి
కేవలం రైతును, పంటను పట్టి పీడించే అంశాలను గురించి ఈ గీతంలో ప్రస్తావించి ఊరుకోలేదు సినారె. ‘దున్నేవాడికే భూమి’ కోసం నలుగురొక్కటై ఐకమత్యంగా నిలవాలని అంటారు. అంతేకాదు అది జరిగినప్పుడే రైతు పరువు నిలుస్తుందని తేల్చారు. సినారె ఉద్యమ స్పృహ కలిగిన కవి. ప్రత్యక్షంగా తాను అనేకానేక ఉద్యమాలను చూశారు. అవసరమైనచోట మమేకమయ్యారు. ముగించే ముందు ఇక్కడ ఒకమాట చెప్పాలి అది కవిత్వమైనా.. వ్యక్తిగతమైనా… సినీగీతమైనా… మరేదైనా.. సినారె ఎప్పుడూ ‘శ్రమజీవుల’ పక్షాన
నిలిచిన కవి.
– పత్తిపాక మోహన్