Manoj Bharathiraja | దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (48) తనయుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో చెన్నైలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొద్ది నెలల కిందరు మనోజ్‌కు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిందని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే గుండెపోటుతో మరణించారని పేర్కొన్నాయి. ఆయనకు మనోజ్ భారతికి భార్య నందన, కూతుళ్లు అర్షిత, మదివధని ఉన్నారు. మనో 1999లో తండ్రి భారతీరాజా దర్శకత్వంలో ‘తాజ్ మహల్’ సినిమాతో నటుడి చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు.
ఈ చిత్రంలో రియాసేన్ హీరోయిన్గా నటించగా.. మణిరత్నం రచనా సహకారం అందించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆయనకు ‘కడల్ పూకల్’, ‘అల్లి అర్జున’, ‘విరుమాన్’, ‘మానాడు’ చిత్రాలు గుర్తింపును తీసుకువచ్చాయి. 2023లో మనోజ్ భారతీరాజా దర్శకుడిగా మారి ‘మార్గళి తింగాల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 20 సంవత్సరాలు నటుడిగా కొనసాగిన ఆయన ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఈ సినిమాలో తండ్రి భారతీరాజాతో పాటు శ్యామ్ సెల్వన్, రక్షణ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. మనోజ్ మృతితో కోలీవుడ్‌లో విషాదం అలుముకుంది. ఆయన మృతిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశాడు. మనోజ్ భారతీరాజా మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిన్న వయస్సులో ఆయన మరణం షాకింగ్‌కు గురి చేసిందన్నారు. భారతీరాజా, మనోజ్ కుటుంబీకులు, సినీ పరిశ్రమలోని స్నేహితులకు సానుభూతిని ప్రకటించారు.