పలు సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఆయన నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టింది. మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘జోరామ్’. ఈ చిత్రం విడుదలకు ముందు పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికైంది. అందులో ఒకటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్. ఈ చిత్రోత్సవాల్లో ‘జోరామ్’ ప్రదర్శితం కాబోతున్నది. ఈ నేపథ్యంలో మనోజ్ బాజ్‌పాయ్ స్పందిస్తూ…‘చిత్రోత్సవాల్లో పెద్ద తెరపై, వందల సంఖ్యలో సినీ ప్రియులు, సినీ మేధావులు మన చిత్రాలను చూసి అభినందించడం ఎంతో ఆనందాన్నిస్తుంది.
చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవడం, పురస్కారాలు దక్కడం అనేది ఒక మంచి చిత్రానికి దక్కే అదనపు గౌరవం. అయితే సాధారణ ప్రేక్షకుడు సినిమా చూసి బాగుందని మెచ్చుకోవడమే ఒక సినిమా పొందే అత్యుత్తమ ప్రశంస. నటుడిగా నేను పురస్కారాల కంటే ప్రేక్షకుల ప్రశంసలే ముఖ్యమని భావిస్తా. అని చెప్పారు’ ప్రస్తుతం ఆయన ‘డిస్పాచ్’, ‘గుల్మోహర్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.