Mangli | తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరయ్యారు. అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో రిసార్ట్ నుంచి పెద్ద పెట్టున శబ్దాలు వస్తున్నాయని, డీజేతో హోరెత్తిస్తున్నారని స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో మెరుపు దాడి చేశారు.
ఒక మహిళా ఎస్సై నేతృత్వంలోని పోలీసుల బృందంతో కలిసి త్రిపుర రిసార్ట్‌పై దాడులు చేయగా, సుమారు 10 మంది మహిళలు, 12 మంది పురుషులు డీజే సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయడం పోలీసుల కంట పడింది. బర్త్ డే పార్టీ, లిక్కర్, డీజేకి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై అనుమానంతో డ్రగ్ కిట్లతో అందరికీ టెస్టులు చేయగా ఒకరికి (దామోదర్) గంజాయి పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
పార్టీ జరుగుతున్న ప్రదేశంలో పెద్ద మొత్తంలో విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. ఈ మద్యానికి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోలేదని తేలింది. ఈ సందర్భంగా గాయని మంగ్లీని ప్రశ్నించగా, పార్టీ నిర్వహణకు, మద్యం వినియోగానికి, డీజే ఏర్పాటుకు అవసరమైన అనుమతులు తీసుకోలేదని ఆమె కూడా అంగీకరించినట్లు సమాచారం.పోలీసులు కార్యక్రమానికి ఉపయోగించిన మద్యం సీజ్ చేసి, ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ పార్టీకి బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా హాజరైంది. ఈ క్రమంలో తాను స్పందిస్తూ.. బర్త్ డే పార్టీకి పిలిస్తే వెళ్లాను కానీ, ఆ గంజాయి కేసులో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. నేను తప్పు చేశాను అని ప్రూఫ్స్ ఉంటే నా పేరు పెట్టండివ కానీ, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫోటోలు పెట్టి నెగెటివ్ గా చేస్తే నా కెరీర్ కు ఎంత ఇబ్బంది అవుతుంది. దయచేసి నా ఫోటోలను తీసేయండి అంటూ చెప్పుకొచ్చింది దివి.