‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనేది సినిమా డైలాగ్. ఇదే ట్యాగ్‌లైన్‌గా సమాజసేవలో తరిస్తున్నారు సులక్ష్య సేవా సమితి నిర్వాహకులు. వృద్ధాశ్రమాల్లోని అభాగ్యులకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు.అనాథలకు అమ్మానాన్న అవుతున్నారు. వృద్ధులకు బిడ్డలు దగ్గర లేని లోటు తీరుస్తున్నారు.
వరంగల్‌కు చెందిన మండువ సంతోష్.. ఓ పది మంది మిత్రబృందంతో కలిసి సులక్ష్య సేవా
సమితిని ప్రారంభించారు. అందరికీ సంతోషం పంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసిన సంతోష్ సొంత కెరీర్ కంటే మిన్నగా పదుగురి సంతోషం కోసం పాటుపడుతున్నారు. ‘2008 నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. దీనిని మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో 2013లో మిత్రుల సహకారంతో సులక్ష్య సేవా సమితికి అంకురార్పణ చేశాను. అందరికీ సంతోషం అనేది మా ప్రధాన నినాదం’ అంటారు సంతోష్. చదువు, వైద్యం, పర్యావరణ పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా సులక్ష్య సేవా సమితి పనిచేస్తున్నది. బడి మానేసిన పిల్లలను పాఠశాలకు పంపేలా చొరవ చూపుతున్నది. నిరుపేద విద్యార్థులను ఫీజు కట్టి చదివిస్తున్నది. వివిధ ఆశ్రమాల్లోని పిల్లలకు యూనిఫామ్, ఇతర దుస్తులు, స్టేషనరీ వస్తువులు అందిస్తున్నది. శ్రీవ్యాస ఆవాసంలో రూ.లక్షతో గ్రంథాలయం ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మాస్కులు, హెల్త్‌కిట్స్ అందించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం స్ఫూర్తితో వరంగల్‌లో వెయ్యికిపైగా మొక్కలు నాటింది. నగరంలోని వివిధ అనాథ, వృద్ధాశ్రమాలకు శక్తిమేరకు నిత్యావసరాలు, బ్లాంకెట్లు పంపిణీ చేస్తున్నది. ‘అనాథ పిల్లలు ఒక పూట ఆకలి తీరితేనే గొప్ప అని భావిస్తారు. కానీ, వారికీ కోరికలు ఉంటాయి. సినిమాలు చూడాలని, పార్కులకు వెళ్లాలని అనుకుంటారు. వాటిని నెరవేర్చడం కోసం పిల్లలను అప్పుడప్పుడు మల్టీప్లెక్స్‌లకు తీసుకెళ్లి సినిమాలు చూపిస్తున్నాం. రామప్ప, లక్నవరం చెరువు, వరంగల్ ఖిల్లా, వేయిస్తంభాల గుడి, జూపార్, సైన్స్ సెంటర్, హైదరాబాద్‌లోని వండర్లాకు తీసుకువెళ్లినప్పుడు ఆ పిల్లల ముఖాల్లో కనిపించిన సంతోషానికి వెల కట్టలేం అనిపించింది. వారికి ఆట వస్తువులు కొనిస్తుంటాం. పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తాం. వృద్ధాశ్రమాల్లో ఉండేవారికి సాంత్వన కలిగించేలా సంగీత విభావరులు, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అందరికీ సంతోషం పంచడానికి మేం చేస్తున్న ప్రయత్నానికి అండగా నిలుస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు సంతోష్.
పిన్నింటి గోపాల్