Kannappa | మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శనివారం గుంటూరులో నిర్వహించారు. కార్యక్రమంలో మోహన్‌బాబు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 27న కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుందని.. ప్రేక్షకులు ఆదరించి.. ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తన తనయుడు విష్ణు ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారన్నారు. సినీ ప్రస్థానాన్ని మోహన్‌బాబు గుర్తుచేసుకుంటూ.. సినీరంగంలో స్వయం కృషితో కష్టపడి పైకివచ్చానన్నారు. జీవితంలో భయం అనేది ఉండకూడదని.. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తన విద్యాసంస్థల్లో విద్యార్థులకు కూడా ఇదే నేర్పిస్తున్నానని.. తన విద్యాలయాల నుంచి ఎంతో మంది ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లుగా సేవలందిస్తున్నారన్నారు.
కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం విష్ణు ఆరేడు సంవత్సరాలు కష్టపడ్డాడని.. ఆ పరమేశ్వరుడు మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాడని చెప్పుకొచ్చారు. మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రభాస్‌పై మోహన్‌బాబు ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ మానవత్వం, మంచి హృదయం ఉన్న వ్యక్తని.. ఈ సినిమాలో నటించమని అడిగిన వెంటనే అంగీకరించరని చెప్పారు. బలవంతుడు ఎదురొచ్చినప్పుడు.. తలదించిన వాడు బాగుపడతాడు.. ఎదురించిన వాడు వాగులో పడతాడు.. నిన్న జరిగింది మర్చిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను.. దటీజ్ రామన్న వంటి డైలాగ్స్‌తో అలరించారు.
మంచు విష్ణు మాట్లాడుతూ.. తన మిత్రుడు ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మూవీలో ప్రభాస్ ఎందుకు నటిస్తున్నాడో.. అందుకు గల కారణం ఏంటో విష్ణు తెలిపాడు. ఈ మూవీలో నటించేందుకు కారణం కేవలం తన తండ్రి మోహన్‌బాబుపై ఉన్న అపారమైన ప్రేమ, గౌరవం, అభిమానమేననన్నారు. ఇప్పటికీ స్నేహానికి ఇంత విలువ ఉందంటే అది ప్రభాస్ లాంటి వారివల్లేనని.. అందరూ స్టార్‌డమ్‌ని కాకుండా గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రేమించాన్నారు. కన్నప్ప సినిమాకు ఇదే తొలి రోడ్ షో అని, అది గుంటూరులో జరగడం ఆనందంగా ఉందన్నారు. సుమారు 50 ఏళ్ల తర్వాత ‘కన్నప్ప’ కథ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోందని విష్ణు గుర్తుచేశారు.
శివుడే 50 ఏళ్ల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథను మళ్లీ చెప్పమని నన్ను ఎంచుకున్నాడని భావిస్తున్నట్లుగా తెలిపాడు. దేవుడిపై నమ్మకం, భక్తి గురించి మాట్లాడుతూ, ప్రతిసారీ మనందరికీ నిజంగా దేవుడు ఉన్నాడా? అనే అనుమానం ఉంటుంది. అక్కడి నుంచే భక్తి పుడుతుంది. కన్నప్ప ప్రయాణం తనను వ్యక్తిగతంగా ఎంతగానో మార్చిందని విష్ణు చెప్పుకొచ్చాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్‌కుమార్, ముకేశ్ రుషి, రఘుబాబు, బ్రహ్మానందంతో పాటు పలువురు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.