Manchu Vishnu | పిలక గిలక” వివాదం, టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. హీరో మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్పలో పిలక గిలక అంటూ బ్రాహ్మణులని అవమానపరిచారని, తక్షణమే మోహన్ బాబు కుటుంబం యావత్ మానవ జాతికి క్షమాపణ చెప్పి “కన్నప్ప” సినిమాలో ఉన్న పిలక-గిలక సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అవి తొలగించని పక్షంలో మూవీ విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సంఘటన, టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది .
మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పాత్రల పేర్లు తమ మనోభావాలు దెబ్బతీశాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు.. తాము ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మూవీ రూపొందించామని చెప్పారు. ఆ పరమశివున్ని భక్తితో చూపించామని అన్నారు. ఈ మూవీలో సీన్స్ షూటింగ్ చేసే ముందు ప్రతీ రోజూ భక్తితో దేవున్ని పూజించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకునేవాళ్లమని విష్ణు పేర్కొన్నారు. స్క్రీప్ట్ దశలోనే వేదాధ్యయనం చేసిన వారితో పాటు, పలువురు ఆధ్యాత్మిక వేత్తల నుంచి సలహాలు కూడా స్వీకరించినట్టు తెలియజేశారు. కన్నప్ప సినిమా ముఖ్య ఉద్దేశం భక్తితత్వాన్ని వ్యాప్తి చేయడమే తప్ప ఎలాంటి వివాదాలు కాదు. మూవీ రిలీజ్ అయ్యే వరకూ ప్రతి ఒక్కరూ దయచేసి ఓపికతో ఉండండి. సినిమా విడుదల కాకముందే ఓ నిర్ణయానికి రావొద్దు అంటూ విష్ణు విజ్ఞప్తి చేశారు.
కన్నప్ప చిత్రంలో పిలక రోల్లో కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించగా, గిలక రోల్లో సప్తగిరి నటించారు. వీరికి సంబంధించిన పోస్టర్ని గతేడాది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గుగురువులు.. అడవికి పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ విడుదలై చాలా రోజులు కాగా, ఇప్పుడు ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు అంటూ మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, కన్నప్ప మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27న చిత్రం విడుదల కానుంది.