సినిమా పేరు: కన్నప్ప
తారాగణం: మంచు విష్ణు, మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్, కాజల్..
దర్శకుడు: ముఖేష్‌కుమార్ సింగ్
నిర్మాత: డా.ఎం.మోహన్‌బాబు
మహాశివభక్తుడైన కన్నప్ప కథతో ఇండియాలో మొత్తం అయిదారు సినిమాలొచ్చాయి. వాటిలో తెలుగులో శ్రీకాళహస్తి మహత్మ్యం, భక్తకన్నప్ప సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులు కన్నప్ప పాత్రలో కన్నడ కంఠీరవ రాజ్కుమార్నీ, రెబల్‌స్టార్ కృష్ణంరాజునీ చూశారు. బ్రహ్మరథం పట్టారు కూడా. అంతటి మహానటులు చేసిన పాత్రను, అంతటి విజయాలను అందుకున్న కథను మళ్లీ చేయడం, మళ్లీ తీయడమంటే అది నిజంగా సాహసమే. ఆ సాహసమే మంచు ఫ్యామిలీ చేసింది. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచి సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు.. అవహేళనలు. ఈ శల్యపరీక్షలన్నింటినీ ఎదుర్కొంటూ ఎట్టకేలకు తెలుగులో మూడోసారి ‘కన్నప్ప’ కథ ఈ శుక్రవారం తెరమీదకు వచ్చింది. మరి ఈ భక్తిరసాత్మకమైన కథ మళ్లీ దృశ్యకావ్యంగా జనాన్ని మెప్పించిందా? లేక అవహేళనల్ని నిజం చేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
ఇది దాదాపు అందరికీ తెలిసిన కథే. బోయవాడైన తిన్నడు(మంచు విష్ణు)కి చిన్నప్పట్నుంచీ దేవుడంటే గిట్టదు. మూఢ విశ్వాసాలను తిన్నడు అస్సలు ఉపేక్షించడు. మహావీరుడుగా పెరుగుతాడు. స్వశక్తినే నమ్ముతాడు. ఒకానొక సందర్భంలో గూడెం పెద్దల నిర్ణయాన్ని తిన్నడు ప్రశ్నిస్తాడు. దాంతో గూడెం నుంచి తిన్నడు బహిష్కరించబడతాడు. తిన్నడిని మనసారా ప్రేమించిన నెమలి(ప్రీతి ముకుందన్) కూడా అయినవారందర్నీ వదిలి తిన్నడిని అనుసరిస్తుంది. శివభక్తురాలైన నెమలికి అడవిలో ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న పంచభూత్మాకమైన వాయులింగాన్ని చూడాలని కోరిక. ఎప్పుడూ నిరంతరం శివధ్యానంలోనే ఉంటుంది తను. నెమలి అలా నిత్యం శివధ్యానంలో ఉండటం తిన్నడికి నచ్చదు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న ఆ వాయులింగాన్ని మహదేవశాస్త్రి పరులకంట పడనీయకుండా రహస్యంగా పూజిస్తుంటాడు. సృష్టిస్థితిలయ కారుడైన ఈశ్వరుడి ప్రతిరూపమైన ఆ వాయులింగం తనకు మాత్రమే సొంతం అనేలా ప్రవర్తిస్తుంటాడు మహదేవశాస్త్రి. ఓ మహాశివరాత్రి పర్వదినాన భార్య నెమలితో గొడవ పడ్డ తిన్నడు, వేటకని అడవికి బయలుదేరతాడు. కానీ శివాజ్ఞ లేకపోవడంతో అతనికి వేట దొరకదు. ఆ తర్వాత ఓ అద్భుతం జరుగుతుంది. ఏమిటా అద్భుతం? తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు? ఈశ్వరుడు వాయులింగంగా ప్రపంచానికి ఎలా సాక్షాత్కరించాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
ఇప్పటివరకూ వచ్చిన రెండు కన్నప్ప కథలకూ ఈ కథకూ కొంత తేడా ఉంది. ఇప్పటివరకూ వచ్చిన రెండు కథలు ధూర్జటిమహాకవి రాసిన ‘శ్రీకాళహస్తీశ్వరమహత్మ్యం’ కావ్యం ఆధారంగా తీసినవి కాగా, ఈ కన్నప్ప మాత్రం శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా తీసిన కథ. అందువల్లే గత చిత్రాల్లో కనిపించిన కొన్ని పాత్రలు ఈ సినిమాలో కనిపించవ్. దక్షిణభారతానికి చెందిన ఓ మహాపుణ్యక్షేత్రానికి చెందిన ఈ కథను ఉత్తరాదివాడైన దర్శకుడు ముఖేష్కుమార్సింగ్ అద్భుతంగా అర్థం చేసుకొని తెరకెక్కించాడనిపిస్తుంది. ఓ కొత్త సినేరియాను ఆయన తెరపై చూపించారు. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రథమార్ధం హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ.. భారీ యుద్ధ సన్నివేశాలతో కథను నడిపించాడు. మరోవైపు హీరోహీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలతో మురిపించాడు. ఇక ద్వితీయార్ధం తిన్నడు కన్నప్పగా మారే క్రమాన్ని మాత్రం అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. అసలు మంచు విష్ణు నుంచి అలాంటి నటనను ఎవరూ ఎక్స్ప్టెక్ట్ చేసుండరు. అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ చాలా గొప్పగా నటించాడు విష్ణు. నాస్తికుడిగా, మహాభక్తునిగా, మరోవైపు అర్జునుడిగా ఇలా రకరకాల షేడ్స్‌తో మెప్పించారు విష్ణు. ఈ సినిమాలో కైలాసం ఎపిసోడ్స్ మాత్రం కాస్త వీక్‌గా అనిపిస్తాయి. అక్షయ్‌కుమార్, కాజల్ ఉత్తరాది శివపార్వతులుగా కనిపించడం వల్ల, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు ఏదో హిందీ టీవీ సీరియల్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక ఇందులో మోహన్‌లాల్, ప్రభాస్ పోషించిన ప్రత్యేక పాత్రలను దర్శకుడు చక్కగా మలిచాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంది. తిన్నడికి శివుడ్ని తెలియజేసేందుకు కైలాసం నుంచి రుద్రుడు ఎప్పుడైతే దిగాడో అక్కడ్నుంచి కథ ఉత్కంఠకు లోను చేసింది. ప్రేక్షకుల్ని కూడా భక్తిపారవశ్యుల్ని చేసింది. కొన్ని సన్నివేశాలైతే గుజ్బప్స్ తెప్పించాయి.
ఎవరెవరు ఎలా చేశారు?
కన్నప్పగా, తిన్నడిగా, అర్జునుడిగా.. ఇందులో మూడు రకాలుగా కనిపించాడు మంచు విష్ణు. ఎవరూ ఊహించని విధంగా అందరి అంచనాలనూ తారమారు చేసి అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు మంచు విష్ణు నటన అద్బుతం. ఈ సినిమాలో విష్ణు తర్వాత చెప్పుకోవాల్సిన పాత్ర ప్రభాస్. ఆయన పాత్ర నిడివి ఓ 40 నిమిషాలుండొచ్చు. ఆ కొద్ది సమయంలోనే సినిమాకు ప్రాణం పోసేశారు ప్రభాస్. సినిమా విజయానికి బలమైన బాటలు వేశారు. రుద్రుడిగా ఆయన నటన కొన్నేళ్లు గుర్తుండిపోతుంది. ఒక సందర్భంలో శివుడిగా కూడా ప్రభాసే చేస్తే బావుండేది కదా.. అనే భావన కూడా ఆడియన్స్‌కి కలుగుతుంది. ఇక మోహన్‌లాల్ పాత్ర చాలా చిన్నది. కిరాతకార్జునీయం ఎపిసోడ్లో శివుడిగా మోహన్‌లాల్, అర్జునుడిగా మంచు విష్ణు కనిపిస్తారు. ఇంట్రవెల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా హైలైట్స్‌లో ఒకటి. మోహన్‌లాల్ ఎప్పటిలాగే తనదైన శైలిలో అదరహో అనిపించారు. ఇక మహదేవశాస్త్రిగా మోహన్‌బాబు జీవించారు. మొత్తంగా సినిమాలో నటించినవారంతా పరిధిమేర రక్తికట్టించారు. కథకు అవసరంలేని, అసహనం కలిగించే పాత్రల్ని బ్రహ్మానందం, సప్తగిరి పోషించారు.
టెక్నికల్‌గా
దర్శకుడు ముఖేష్కుమార్సింగ్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాలో అడుగడుగునా కనిపించింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు ఆయన ఓ అద్భుతాన్నే ఆవిష్కరించారు. ప్రేక్షకుల్ని భక్తిపారశ్యుల్ని చేశారు. ఏదేమైనా ఈ సినిమా యుద్ధ సన్నివేశాలు కాస్త వీక్‌గానే అనిపిస్తాయి. ఫైట్ల విషయంలో కాస్త జాగ్రత్త పడితే బావుండేది. ఇక ఈ సినిమా కెమెరా వర్క్ సూపర్. ప్రతి ఫ్రేమ్‌నీ ఓ పెయింటిగ్లా మలిచారు డీవోపీ షెల్డెన్. వాయులింగం డిజైన్ కూడా చాలా బావుంది. ఈ విషయంలో కళా దర్శకుడ్ని అభినందించాలి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. స్టిఫెన్ దేవస్సీ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. ఆయనిచ్చిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు నేపథ్యసంగీతంతో ఆడియన్స్‌ని రోమాంచితుల్ని చేశారాయన. అన్ని పాటలూ బావున్నాయి.
చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయడం ఓ సాహసం. నేటి తరానికి ఈ కథను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా చూస్తున్నంతసేపు చారిత్రాత్మకంగా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయినా.. జనరంజకంగా సినిమాను మలిచే క్రమంలో దర్శకుడు ఆ మాత్రం సినిమాటిక్ లిబరిటీ తీసుకోవడం తప్పేం కాదు. మొత్తంగా అందరూ చూడాల్సిన సినిమా ‘కన్నప్ప’
బలాలు
కథ, కథనం, సంగీతం, కెమెరా, పాత్రధారులు నటన..
బలహీనతలు
కైలాసం ఎపిసోడ్స్, బ్రహ్మానందం కామెడీ సీన్స్, ప్రథమార్ధం కాస్త స్లో నేరేషన్..
రేటింగ్ 3/5