‘భగవంతుని ఆశీస్సుల వల్లే ఈ సినిమా చేయగలిగా. అందరూ హీరోలే ఈ సినిమాలో. అందరూ విజయాలను అందుకున్నవారే. వీరంతా అందించిన సహకారం వల్లే ఇది సాథ్యమైంది. మహాభారతం సీరియల్ అద్భుతంగా తీసిన ముఖేష్కుమార్సింగ్ ఈ సినిమాను అత్యద్భుతంగా తీశాడు. బోయవాడు తిన్నడు ఈశ్వరుడి కళ్లిచ్చి కన్నప్ప అయ్యాడు. అది ఎలాగో రేపు సినిమా చూస్తే తెలుస్తుంది.’ అని డా.మోహన్‌బాబు అన్నారు. మంచు విష్ణు హీరోగా ఆయన నిర్మించిన భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’.
మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రలు పోషించిన ఈ పానిండియా చిత్రానికి ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకుడు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్‌బాబు మాట్లాడారు. ‘ఎంతో రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ తయారు చేశా. శివాజ్ఞ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు. ఎన్నో కష్టాలకోర్చి సినిమా చేశాను. ఇంకొన్ని రోజుల్లో విడుదలవుతోంది. ఆదరిస్తారని ఆశిస్తున్నా.’ అని మంచు విష్ణు పేర్కొన్నారు.