Manchu Manoj | బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలలో విజయ్ తెరకెక్కించిన చిత్రం భైరవం. ఈ మూవీ మే 30న థియేటర్స్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కామెంట్ చేశారు. ఒక కులానికి చెందిన వ్యక్తులు కలిసి సినిమా చేస్తున్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొందరు బాగా ట్రెండ్ చేస్తున్నారు. సినిమా అనేది ఏ ఒక్క కులానికి చెందినది కాదు. సినిమా అనే కళామతల్లి తన మతం చూడదు.. కులం చూడదు.. గోత్రం చూడదు. మా కులం సినిమా.. నా గుడి సినిమా థియేటర్ అని మంచు మనోజ్ అన్నారు.
ఒక టికెట్ తెగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, హిందూ సినిమానా, క్రిస్టియన్ సినిమానా అనేది ఎవరూ పట్టించుకోరు. హీరో సూర్య ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన క్యాస్ట్ ఏంటి?. తెలుగు మూవీ లవర్స్ టాలెంట్ ఉంటే ఎక్కడివారైనా తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. అంత గొప్ప ఇండస్ట్రీ మనది. తెలంగాణకు చెందిన సందీప్ రెడ్డి వంగాని జాట్, కపూర్ అని చూసి బాంబేలో నెత్తిన పెట్టుకోలేదు కదా, మన ఇండియన్ సినిమాలో టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. కులం, మతం, బ్యాగ్రౌండ్ ఇవేమి చూడకుండా కేవలం టాలెంట్ చూసి ఆర్టిస్టుల మీద ఖర్చు పెట్టేవారే మన నిర్మాతలు. సినిమా మాకు అమ్మాలాంటిది. కొడుకు కూతురులను వేర్వేరుగా చూడదు. ఆమెకి అందరూ సమానమే.
దయచేసి కులాలు గోత్రాలు మా ఇండస్ట్రీలోకి తీసుకురావొద్దంటూ రిక్వెస్ట్ చేశారు మనోజ్. ఇక ఈ మధ్య సినిమాపై బాయ్ కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తోంది. దర్శకుడు విజయ్ చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. ఎప్పుడో ఏదో ఒక పోస్టు పెట్టారని అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. హ్యాక్ అయిందని ఆయన అంటున్నారు. అలాంటిది దాన్ని తీసుకొచ్చి ట్యాగ్ చేసి, ఇంతమంది కష్టపడి పని చేసిన సినిమాపై పోస్టులు పెడుతున్నారు..’చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు దర్శకుడు వీరాభిమాని. ఆయనకు ప్రేమ లేకపోతే.. రెండు హిట్లు ఇచ్చి మూడో సినిమా చేసి కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా వెళ్లారు. వేరే ఎవరైనా అంటే ఆయన పట్టించుకునేవారు కాదు. కానీ, సొంత కుటుంబంలాంటి మెగా అభిమానులే విమర్శిస్తుంటే.. ఆయన్ను డల్ గా చూడలేకపోతున్నా. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుతున్నా అని మనోజ్ స్పష్టం చేశారు. ఇక ముగ్గురు హీరోలు కలిసి వేదికపై స్టెప్పులు కూడా వేశారు.