Manchu Manoj | మంచు మోహన్ బాబు వారసుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మంచు మనోజ్ మరికొద్ది రోజులలో భైరవం అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మనోజ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తమ ఇంట్లో జరుగుతున్న గొడవలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో శివయ్య అని కన్నప్ప గురించి అన్నాను. తర్వాత అలా అనకుండా ఉండాల్సింది అని బాధపడ్డాను. ఎందుకంటే ఆ మూవీ కోసం చాలా మంది కష్టపడ్డారు. అందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖులు నటించారు. నా కామెంట్ వలన వారి అభిమానులు బాధపడి ఉంటారు. వారి కష్టాన్ని వృధా చేయోద్దు అనుకున్నా. ఒక్కడి వలన అంతమంది కష్టాన్ని తక్కువ చేయోద్దు అని అనిపించింది. అందుకే క్షమాపణలు చెబుతున్నా అని మనోజ్ అన్నారు.
ఇక తన తండ్రి మోహన్ బాబు కాళ్లు పట్టుకోవాలని ఉందని, తన కుమార్తెను ఆయన ఒడిలో పెట్టాలని ఉందని తెలియజేశారు. తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాం. నా సతీమణి బొమ్మల కంపెనీ ప్రారంభించగా, దానికి నేను ఆర్ట్ వర్క్ చేయడంతో పాటు కథలు రాసాను. ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం. మాకు ఊహించని విధంగా కష్టాలు ఎదురయ్యాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నందువల్లే మీడియా ముందుకు రావలసి వచ్చింది. నా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో అందరం కలిసాము. అయితే మా కుటుంబంలో ఒకరికి అది నచ్చలేదు. కళాశాలలోని కొన్ని సమస్యలు పెద్దల వరకు వెళ్లడం లేదని విద్యార్థులు లేఖలు రాసి నాకు ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడితే నీకేం సంబంధం అనే మాట వచ్చింది.
ఆ సమయంలో విద్యాసంస్థలో పనిచేసే వారందరితో తనపైనా, తన అర్ధాంగిపైనా కేసులు పెట్టించారని ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో తన అర్ధాంగిని లాగడంతో నా హృదయం ముక్కలైందని మనోజ్ అన్నారు. నాది బాధతో వచ్చిన కోపమని అన్నారు. మా నాన్న కాళ్లు పట్టుకోవాలని నాకు ఉంది కాని చేయని తప్పును అంగీకరిస్తే, తన పిల్లలకు తానేమి నేర్పించినట్లు అవుతుంది. తన తండ్రి మోహన్ బాబు నేర్పించిన నీతి ఇదేనని, అందుకే తాము ముందుకు వెళ్లలేకపోతున్నామని మనోజ్ చెప్పుకొచ్చారు. తామంతా మళ్లీ కలిసి ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాను, అలానే సమస్యలు సృష్టించిన వారు వారి తప్పును తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు మంచు మనోజ్.