Manchu Manoj | గత కొద్ది రోజులుగా కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వ్యవహారం నెట్టింట ఎంత చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా,ఇందులో ఎంతో మంది టాప్ మోస్ట్ ఆర్టిస్టులు నటించారు.జూన్ 27న చిత్రం రిలీజ్ అవుతుందని ప్రకటించగా, ఈ సమయంలో హార్డ్ డిస్క్ మిస్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మంచు విష్ణు.. ఈ మిస్సింగ్ వ్యవహారం గురించి స్పందిస్తూ..తన తమ్ముడు మనోజ్ మనుషులే ఈ పని చేశారని విష్ణు సందేహించారు. మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని సంచలన కామెంట్స్ చేశారు. అయితే వారే స్వయంగా చేశారా.. ? లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదంటూ విష్ణు చెప్పడం చర్చనీయాంశం అయింది.
అయితే విష్ణు కామెంట్స్‌పై తాజాగా మంచు మనోజ్ స్పందించాడు. మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘భైరవం’ సినిమా ఇటీవల రిలీజై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో శనివారం ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కన్నప్ప హార్డ్ డ్రైవ్ కు సంబంధించిన ప్రశ్న అడగ్గా.. “మీకే ఇచ్చాను కదా ఎక్కడుంది?” అని మనోజ్ ఎదురు ప్రశ్నిస్తూ గట్టిగా నవ్వేశారు. ఒకప్పుడు సరదాగా ఏదో మాట్లాడాను కానీ, బర్త్ డే తర్వాత అలాంటివి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. హార్డ్ డిస్క్ విషయంలో మాత్రం తాను మాట్లాడనని అన్నారు. ఒక సినిమా అనేది చాలా మంది కష్టంతో కూడుకున్నది.. అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు రీరిలీజులతో కొత్త సినిమాలని చంపుకోకూడదని ‘ఖలేజా’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంచు మనోజ్ కామెంట్స్ చేసారు. మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే మిస్ అయిన హార్డ్ డిస్క్ లో వీఎఫ్ఎక్స్ పూర్తి చేసిన 70 నిమిషాల వీడియో ఫుటేజ్ ఉందని, కానీ పూర్తి సన్నివేశాలు అందులో లేవంటూ విష్ణు ఇటీవల స్పష్టం చేశారు. అయితే దానికి పాస్ వర్డ్ ఉందని, 99 శాతం దాన్ని ఎవరూ క్రాక్ చేయలేరని, ఒక శాతం ఛాన్స్ మాత్రమే ఉందని అన్నారు. సినిమాకి ఎందరో కష్టపడ్డారని, ఒకవేళ ఆ సన్నివేశాలు లీక్ చేసినా ఎవరూ దాన్ని ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా విష్ణు కోరారు.