Manchu Manoj | మంచు మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మనోజ్ గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆస్తి విషయాలలో విష్ణుకి, మనోజ్ మధ్య గొడవలు, ఇక భైరవం ప్రమోషన్స్ సమయంలో ఆయన చేసిన ఆసక్తికర కామెంట్స్ మనోజ్ పేరు ట్రెండింగ్‌లో ఉండేలా చేశాయి. చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ కంబ్యాక్ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మనోజ్ లైనప్ లోనూ వరుస చిత్రాలు ఉండటంతో రానున్న రోజులలో ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్టైన్ చేయనున్నారు. కెరీయర్ లో మంచిమంచి సినిమాలు చేసిన మనోజ్ ప్రేక్షకులకు గుర్తుండి పోయే పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా అరడజన్ చిత్రాల్లో నటించి అదరగొట్టిన మనోజ్ 2004లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు . ఆ తర్వాత శ్రీ, రాజు బాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంట్ తీగ, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. 2018 వరకు వరసుగా సినిమాలు చేసిన ఆయన మళ్లీ మే30,2025 న ‘భైరవం’ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చారు. 8 ఏళ్ల తర్వాత తిరిగి వెండితెరపై కనిపించి అలరించారు. అయితే భైరవం ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్‌పై మనోజ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మనోజ్‌కి మన టాలీవుడ్ హీరోలు చాలా మందితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎన్టీఆర్, మనోజ్ కూడా ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరిగారు. వారి ఇద్దరి పుట్టిన రోజులు కూడా ఒకే రోజు కావడం విశేషం. ఈ ఇద్దరు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. అయితే చిన్నతనంలో తాను చేసిన వెధవపని వల్ల ఎన్టీఆర్ బాగా ఏడ్చాడు అని మనోజ్ తాజాగా చెప్పుకొచ్చారు. చిన్న తనంలో మేము ఐదో, ఆరో తరగతి చదువుతున్నాం.. ఓ పెళ్ళికి వెళ్ళాం. అప్పుడు ఒక బెలూన్ ను తీసుకొచ్చి.. దానికి మంట పెట్టాను.. ఆ మంట కాస్తా ఎన్టీఆర్ చేతికి మంట అంటుకుంది. దాంతో ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడు. ఎన్టీఆర్ ఏడుపు చూసి మా అమ్మమ్మ వచ్చి నన్ను చితక్కొట్టింది. మా అమ్మమ్మ ఆదిలక్షమ్మ.. బిడ్డను చంపేస్తావా అంటూ తరిమి తరిమి కొట్టింది అని మనోజ్ అన్నాడు. ఇదే విషయాన్ని కూడా మనోజ్ గతంలో మంచు లక్ష్మీ హోస్ట్ గా చేసిన ఓ షోలో మాట్లాడారు.