Manchu Lakshmi | తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి,సీనియర్ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తి మధ్య జరిగిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మంచు లక్ష్మి స్వీయ నిర్మాణంలో తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నటించిన ‘దక్ష’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చోటు చేసుకున్న ఈ వివాదం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్వ్యూలో వీఎస్ఎన్ మూర్తి వేసిన వ్యక్తిగతమైన ప్రశ్న మంచు లక్ష్మిని తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. “మీరు 50 ఏళ్లకు దగ్గరవుతున్న మహిళ. 12 ఏళ్ల కూతురు ఉండి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం గురించి మీ అభిప్రాయం ఏంటి?” అనే ప్రశ్నపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ, “ఇలాంటి ప్రశ్న అడగడానికి మీకెంత ధైర్యం? ఇదే ప్రశ్న మహేశ్ బాబుని అడగగలరా? మహిళల పట్ల మీకు అంత చులకనగా అనిపిస్తుందా? జర్నలిస్టు అయి ఇలాంటి ప్రశ్నలు వేస్తే మిమ్మల్ని చూసి జనం ఏం నేర్చుకుంటారు?” అంటూ ఎదురుదాడికి దిగారు.
ఇంతటితో ఆగకుండా మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేసింది. సదరు జర్నలిస్ట్ తనపై బాడీ షేమింగ్ చేశాడని, తాను అవమానానికి గురయ్యేలా ప్రశ్నలు వేయడం వల్ల తన ఆత్మస్థైర్యం దెబ్బతిందని పేర్కొన్నారు. జర్నలిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై సినీ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు మంచు లక్ష్మికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో నటీమణి హేమ తాజాగా స్పందిస్తూ, “మీడియా వల్ల బాధపడినవారిలో నేను కూడా ఒకరిని. పెద్దగా చదువుకోని నాలాంటి వాళ్లు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ చదువుకున్న, బాధ్యత ఉన్న జర్నలిస్టులు ఈ రీతిగా మాట్లాడితే బాధాకరం.
ఏది అడగాలి, ఏది అడగకూడదు అన్న విచక్షణ లేకపోవడం బాధ కలిగిస్తోంది. మొన్నటికి మొన్న యాంకర్ సుమ గురించి చిన్న వ్యాఖ్య చేస్తే ఆమెతో క్షమాపణలు చెప్పించారు. అలాంటి సందర్భాల్లో స్పందించిన జర్నలిస్టులు ఇప్పుడు మంచు లక్ష్మి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? లేడీ జర్నలిస్టులు సైతం దీన్ని ఖండించకపోవడం సిగ్గుచేటు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక, గతంలో కూడా ఇండస్ట్రీలోని మహిళల పట్ల అసభ్యంగా వ్యాఖ్యానించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు అప్పట్లో తీవ్రంగా స్పందించిన ఘటనలు గుర్తుచేస్తూ, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సంఘాలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయో అని ప్రశ్నించారు. ఫిల్మ్ ఛాంబర్ మరియు జర్నలిస్టుల అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘మా’ ప్రెసిడెంట్‌గా ఉన్న మంచు విష్ణు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏది ఏమైన మంచు లక్ష్మి చేసిన ఫిర్యాదుపై ఫిల్మ్ ఛాంబర్ ఎలా స్పందిస్తుందో, ఈ వ్యవహారంలో పరిశ్రమ ఏ విధంగా ముందడుగు వేస్తుందో వేచి చూడాల్సిందే.