ఇటీవల వచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంలో చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది హైదరాబాదీ సొగసరి మానస వారణాసి. ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్లో మంచి ఆఫర్లొస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంలో ఈ అమ్మడు ఓ ఐటెంసాంగ్‌లో నర్తించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ ప్రత్యేకగీతం కోసం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించారని, డేట్స్లేని కారణంగా ఆమె తిరస్కరించిందని సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ స్పెషల్‌సాంగ్ కోసం చిత్రబృందం యంగ్ హీరోయిన్ను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉందట. ఇప్పటికే మానస వారణాసితో సంప్రదింపులు పూర్తయ్యాయని అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఒక్కపాట మినహా షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.