డాన్స్, మాస్ అప్పీల్, యాక్షన్ అంశాల్లోనే కాదు.. నవ్వించడంలోనూ చిరంజీవి దిట్టే. ఆయన కామెడీని ఇష్టపడే వాళ్లు తెలుగు రాష్ర్టాల్లో కోకొల్లలు. వారందరికోసం కాస్త గ్యాప్ తీసుకొని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు చిరంజీవి. ఆ సినిమానే ‘మన శంకర వరప్రసాద్‌గారు’. పైగా ఈ తరహా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. సంక్రాంతికి సినిమా విడుదల కానున్నది. అందుకే ప్రమోషన్స్‌లో మేకర్స్ వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట పెద్ద హిట్. ఈ ఆదివారం మరో పాటని విడుదల చేశారు. ఈ పాట సాకీతో మొదలైంది.
శంకరవరప్రసాద్ గెటప్పులో ట్రెడిషనల్ లుక్‌తో ఉన్న చిరంజీవి పడవలో వెళుతూ.. ‘శశిరేఖా.. ఓమాట చెప్పాలి..’ అనడం.. ‘ఓ ప్రసాదూ.. మోమాటాల్లేకుండా.. చెప్పేసెయ్.. ఏమీకాదూ..’ అని రాగయుక్తంగా నయనతార బదులివ్వడంతో పాట మొదలైంది. ఇక అక్కడ్నుంచి భీమ్స్ మార్క్ బీట్తో హుషారుగా పాట సాగింది. ‘ఓ శశిరేఖా.. నీ చుట్టూ బిలియన్సూ.. నావన్నీ ఈఎమ్ఐసూ..’ అంటూ ఆధునిక సాహిత్యంతో అనంత శ్రీరామ్ పాట రాయగా, భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, మధుప్రియతో కలిసి పాడారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ, చిరంజీవి, నయనతార జోడి కెమిస్ట్రీ ఈపాటకు నిండుదనాన్ని తెచ్చాయి. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల.