‘ఒక రచయిత పీహెచ్డీ గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో.. ‘మన సినిమా-ఫస్ట్రీల్’ పుస్తకం అలా ఉంది. నా దృష్టిలో రెంటాల జయదేవ కాలమిస్ట్, జర్నలిస్ట్ మాత్రమేకాదు. అంతకు మించినవాడు. ‘ఫస్ట్ రీల్’లో తెలుగు టాకీ తాలూకా కథ చెప్పాడు. ఇదొక నవల లాంటి పుస్తకం. సినిమాపై ప్రేమ ఉన్న వ్యక్తి పుస్తకం రాస్తే ఎంత ప్రామాణికంగా ఉంటుందో ఈ పుస్తక రచనతో జయదేవ నిరూపించారు. జయదేవ సినిమా రచయిత అయ్యేలోపు మరిన్ని పుస్తకాలు రాయాలని కోరుకుంటున్నా.’ అని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ పాతికేళ్ల సినీ పరిశోధనకు అక్షరరూపం ‘మన సినిమా.. ఫస్ట్రీల్’. దక్షిణభారత సినిమా చరిత్రను సమగ్రంగా పాఠకులకు అందించిన గ్రంథం ఇది. ఎమెస్కో పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కౌండిన్యకు, మలి ప్రతిని సభాధ్యక్షత వహించిన ఎమెస్కో విజయ్‌కుమార్‌కు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ కవి, విమర్శకులు అఫ్సర్, రచయిత్రి కల్పనా రెంటాల, దర్శకులు దశరథ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.