కలాం కావల్
సోనీ లివ్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: మమ్ముట్టి, వినాయకన్, జిబిన్ గోపినాథ్, గాయత్రి అరుణ్ తదితరులు
దర్శకత్వం: జితిన్ కే జోష్
విలక్షణ పాత్రల్ని ఎంచుకోవడంలో మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తీరేవేరు. తన స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి.. ఎన్నో విభిన్నమైన, వినూత్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు యావత్ సినీ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. ‘సైకో కిల్లర్’ పాత్రకు ‘సై’ అన్నాడు. కన్నింగ్ లుక్స్, కనికరం లేని హంతకుడు ‘స్టాన్లీ దాస్’గా ‘ఔరా!’ అనిపించాడు. ‘కలాం కావల్’తో మరోసారి తనలోని వినూత్న నటనా నైపుణ్యాన్ని బయటపెట్టాడు మమ్ముట్టి. నిజ జీవిత సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్ కేసు ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది.
స్టాన్లీ దాస్ (మమ్ముట్టి).. పెళ్లి చేసుకుంటానని చెప్పిన మహిళనే హత్యచేయడంతో కథ మొదలవుతుంది. ఒంటరి మహిళలను ట్రాప్ చేసి వలలో వేసుకోవడం దాస్‌కు వెన్నతో పెట్టిన విద్య. జీవితంలో విసిగిపోయిన ఆడవాళ్లకు ప్రేమ, పెళ్లి, కొత్త జీవితం అనే ఆశ చూపించి నమ్మిస్తాడు. వారితో ఒకరోజు గడిపి.. అదే రోజున హత్య చేస్తుంటాడు. మరోవైపు తమిళనాడులోని ఒక ఊర్లో.. ఓ మహిళ మిస్సింగ్ గురించి రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. దాంతో క్రైమ్ బ్రాంచ్‌కి చెందిన స్పెషల్ ఆఫీసర్, గుడ్లగూబగా పిలుచుకునే జయకృష్ణ అలియాస్ (వినాయకన్) రంగంలోకి దిగుతాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యతలు తీసుకుంటాడు.
ఇన్వెస్టిగేషన్లో భాగంగా.. చాలాకాలం నుంచి చాలామంది ఆడవాళ్లు కనిపించకుండా పోతున్నారనే సంగతిని తెలుసుకుంటాడు. ఆ మహిళలంతా తాము ప్రేమించిన వారితో ఊరొదిలి వెళ్లిపోయినవారే! వారిలో చాలామంది పెళ్లి వయసు దాటిపోయినవారు, విడాకులు తీసుకున్నవారు, భర్తను కోల్పోయినవారే! కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయకపోవడానికి అదే ప్రధాన కారణమని గుర్తిస్తాడు జయకృష్ణ. అనూహ్యంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లోకి సీరియల్ కిల్లర్ అయిన స్టాన్లీ దాస్ కూడా వస్తాడు.
ఇంతకూ ఈ స్టాన్లీ దాస్ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపిస్తూనే.. సీరియల్ కిల్లర్‌గా ఎందుకు మారాడు? ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి ఎందుకు చంపేస్తున్నాడు? కేసు దర్యాప్తు పసిగట్టి, తన వ్యూహాలను ఎలా అమలు పరిచాడు? కేసు నుంచి తప్పించుకొనేందుకు ఎలాంటి ఎత్తులు వేశాడు? చివరికి స్టాన్లీ దాస్.. పోలీసులకు చిక్కాడా? లేదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఆసక్తికర, ఆశ్చర్యకర సమాధానమే.. ఈ సినిమా కథ.