‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ సోయగం మమిత బైజు. ప్రస్తుతం ఈ భామ ‘డ్యూడ్’ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ సరసన కథానాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా కథానాయిక మమితబైజు చిత్ర విశేషాలను పంచుకుంది. ‘ప్రేమలు’ విడుదల తర్వాత చిత్ర దర్శకుడు కీర్తిశ్వరన్ తనను సంప్రదించాడని, కథ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించానని చెప్పింది.
ఈ సినిమాలో తాను కురల్ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, కథాగమనంలో తన క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. ‘ఇప్పటివరకు ఈ తరహా పాత్ర చేయలేదు. కురల్ నిజాయితీపరురాలైన అమ్మాయి. తను అందరితో స్నేహంగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఈ పాత్ర చేయడం ఓ సవాలు’ అని చెప్పింది. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్‌కు సంబంధించిన సంభాషణలను రాత్రంతా ప్రాక్టీస్ చేశానని, షూటింగ్ వెళ్లే ముందు పూర్తిగా ప్రిపేర్ కావడం అలవాటు చేసున్నానని మమితబైజు తెలిపింది.