యువ దర్శకులతో పనిచేసేందుకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారు. వశిష్టతో చేసిన ‘విశ్వంభర’ విడుదల కానున్నది. బాబీ సినిమా షూటింగ్ మొదలుకానున్నది. శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేయబోతున్నారాయన. ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్లకు అవకాశాలిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఈ క్రమంలోనే మలయాళ దర్శకుడు తరుణ్మూర్తితో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే చిరంజీవిని తరుణ్‌మూర్తి కలిశారు. చేయబోతున్న కథకు సంబంధించిన చర్చలే వీరిద్దరిమధ్య జరిగాయని ఇన్సైడ్ టాక్. అపరేషన్ జావా, సౌదీ వెళ్లక్క వంటి విజయవంతమైన చిత్రాలతో మంచి దర్శకుడిగా మలయాళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్‌మూర్తి.
వాస్తవికతకు దగ్గరగా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీయడంలో తరుణ్‌మూర్తి సిద్ధహస్తుడు. అలాంటి క్లాసిక్ మేకర్ మెగాస్టార్‌ని కలవడం ఫిల్మ్‌వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎమోషనల్‌గా సాగే సామాన్యుడి పోరాటమే ప్రధానాంశంగా ఈ కథ ఉంటుందంటూ లీకులు అందుతున్నాయి. వాస్తవం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.