Actor Siddique | నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్ధిఖీ (Actor Siddique)కి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది.
కేరళ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. సిద్ధిఖీ ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. నటుడు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ మేరకు నటుడికి అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తూ (interim protection from arrest).. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణ కోసం పోలీసుల ముందు హాజరుకావాలని, విచారణకు సహకరించాలని సూచించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి, నటికి నోటీసులు జారీ చేసింది.
మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ నివేదిక నేపథ్యంలో నటి రేవతి సంపత్.. నటుడు సిద్ధిఖీపై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఓ సినిమాలో అవకాశం కోసం తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధిరాలు ఆరోపించింది. ఆయన డిమాండ్లను తిరస్కరించడంతో 2016లో తిరువనంతపురంలో ఓ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. రేవతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం నటుడి పిటిషన్‌కు కొట్టివేసింది. ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సరైన దర్యాప్తు జరిగేందుకు కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సీఎస్ డయాస్ బెయిల్‌కు తగిన కేసు కాదన్నారు. పొటెన్సీ టెస్ట్ జరగలేదని.. సాక్షులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది.
కోర్టు తీర్పుతో సిద్ధిఖీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేశారు. ఈ క్రమంలో సిద్ధిఖీ బెయిల్ కోసం దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయనకు బెయిల్ లభించింది.
Also Read..
Rhino | బైకర్‌ను వెంబడించి దాడి చేసిన ఖడ్గమృగం.. షాకింగ్ వీడియో
Panther Attack | మ్యాన్ ఈటర్ పాంథర్ వరుస దాడులు.. 11 రోజుల్లో ఏడుగురు మృతి
Tirumala Laddu | తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ 3కు విచారణ వాయిదా