Malayalam Actor Siddique | నటిపై అత్యాచారం కేసులో మలయాళ నటుడు సిద్ధిఖీ (Actor Siddique) నేడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే సిద్ధిఖీ అరెస్ట్ అయిన గంటలోపే అతడు బెయిల్ ద్వారా బయటికి వచ్చాడు. అత్యాచారం కేసులో విచారణకు సంబంధించి నేడు దర్యాప్తు బృందం ఎదుట సిద్ధిఖీ హాజరయ్యాడు. అయితే సిద్ధిఖీని విచారించిన అనంతరం అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు వెళ్లే గ్యాప్లో బెయిల్ లభించడంతో విడుదల అయ్యారు. నవంబర్లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ గడువు ముగియడంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలో నటి రేవతి సంపత్.. నటుడు సిద్ధిఖీపై అత్యాచారం ఆరోపణలు చేసింది. ఓ సినిమాలో అవకాశం కోసం తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధిరాలు ఆరోపించింది. ఆయన డిమాండ్లను తిరస్కరించడంతో 2016లో తిరువనంతపురంలో ఓ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిద్ధిఖీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు తనపై రేవతి చేసిన ఆరోపణలపై సిద్ధిఖీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆమె కావాలనే తన పరువు, మర్యాదలకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆమె కుట్రలు పన్నుతుందని ఫిర్యాదులో తెలిపాడు.