Malayalam Actor | మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు సంతోష్ కె. నాయర్ (65) కేరళలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా ఏనతు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ఆయనతో పాటు కారులో ఉన్న ఆయన భార్య శుభశ్రీ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న క్రమంలో సంతోష్ నాయర్‌కు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
సంతోష్ నాయర్ 1982లో ఇతు జ్ఞాంగళుడే కథ (Ithu Njangalude Katha) అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆయన 100కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కేవలం ప్రతినాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా, కామెడీ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘మోహినియాట్టం’ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతుండగానే ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. సంతోష్ నాయర్ మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు మరియు అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.