భాషల మధ్య అంతరాలు, ఇండస్ట్రీల మధ్య హద్దులు చెరిగిపోతున్న పాన్ ఇండియా ట్రెండ్‌లో నాయికలు మరింత స్వేచ్ఛగా అవకాశాలు అందుకుంటున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది మలయాళ భామ మాళవిక మోహనన్. మలయాళ, తమిళ చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబినేషన్ మూవీలో ఒక నాయికగా అవకాశం దక్కించుకున్న మాళవిక..మరికొందరు స్టార్స్ సరసన నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నది. ఈ క్రమంలో మహేష్ బాబు గురించి ఆమె తాజాగా స్పందించింది. మాళవిక మాట్లాడుతూ…‘మహర్షి’ సినిమా చిత్రీకరణ సమయంలో నాన్న మోహనన్‌తో కలిసి షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ మహేష్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా పలకరించారు. మహేష్‌తో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. మాళవిక తండ్రి కేయూ మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. ‘మహర్షి’ చిత్రానికి ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఈ నాయిక విక్రమ్ సరసన ‘తంగలాన్’, ‘క్రిస్టీ’, ‘యుద్ర’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.