Malavika Mohanan | ‘ఆసక్తి రేకెత్తిస్తున్న సదరన్ ఇండస్ట్రీ సినిమాల్లో విక్రమ్ ‘తంగలాన్’ ఒకటి. ఈ సినిమాలో నా పాత్ర ఊహలకు అందని రీతిలో ఉంటుంది. నా కెరీర్‌కి మలుపునిచ్చే సినిమా ‘తంగలాన్” అంటున్నది కథానాయిక మాళవిక మోహనన్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘తంగలాన్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) లో పనిచేసే కార్మికుల జీవితాల చుట్టూ తిరిగే కథాంశంతో దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ఓ తండాకు చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాళవిక మోహనన్ తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్నది. ఈ సందర్భంగా తను పై విధంగా స్పందించింది. దీంతోపాటు మాళవిక పెట్టిన మరో పోస్ట్ కూడా నెటిజన్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నది. ‘నటించడమంటే తేలిగ్గా చేసేస్తాను కానీ, డబ్బింగ్ అంటేనే భయం. నన్నడిగితే సినిమా మేకింగ్‌లో డబ్బింగ్ అంత కష్టమైన పని వేరొకటి లేదు. కాస్త భయంగా ఉంది. ఎవరైనా వచ్చి నా చేయి పట్టుకుని ధైర్యాన్నిస్తారా?’ అంటూ తన వ్యక్తిగత సాంఘిక మాధ్యమంలో కామెంట్ పెట్టింది మాళవిక మోహనన్. ఈ కామెంట్‌కి నెటిజన్స్ కూడా గమ్మత్తుగా స్పందిస్తున్నారు.