లేడీ సూపర్‌స్టార్ నయనతార, యువ కథానాయిక మాళవికా మోహనన్ మధ్య గత కొన్ని మాసాలుగా కోల్ట్‌వార్ నడుస్తున్నది. నయనతారను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు చేస్తున్నది మాళవికా మోహనన్. ‘కనెక్ట్’ చిత్రంలో నయనతార ఆసుపత్రి సన్నివేశాల్లో కూడా హెవీ మేకప్‌తో కనిపించిందని, ఆ సీన్ చాలా కృత్రిమంగా అనిపించిందని కొద్ది రోజుల క్రితం మాళవిక వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె మాటలపై తీవ్రంగా ప్రతిస్పందించింది నయనతార. ‘కనెక్ట్’ పక్కా కమర్షియల్ చిత్రం కాబట్టి దర్శకుడు సూచనల మేరకే నటించానని, చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూడొద్దని హెచ్చరించింది.
ఈ వివాదం సమసిపోకముందే మరోమారు వివాదాస్పద కామెంట్స్ చేసింది మాళవికా మోహనన్. తన తాజా చిత్రం ‘క్రిస్టి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు లేడీ సూపర్‌స్టార్ అనే పిలుపు నచ్చదని, కథానాయికల్ని కూడా సూపర్‌స్టార్స్ అని పిలిస్తే బాగుంటుందని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై నయనతార అభిమానులు సోషల్‌మీడియా వేదికగా మండిపడ్డారు. అవి నయనతారను ఉద్దేశించి చేసినవేనని, మాళవిక వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రమమ్యే సూచనలు కనిపించడంతో మాళవిక వివరణ ఇచ్చింది. తనకు నయనతార అంటే ఎంతో గౌరవమని, నటనాపరంగా ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపింది. అగ్ర కథానాయికలందరినీ ఉద్దేశించి తాను ఆ మాటలు అన్నానని, ఇక ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది.