Sameer Wankhede | నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (The Bads of Bollywood) వెబ్ సిరీస్ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబించేలా ఉందని దీనివలన తన ప్రతిష్ట దెబ్బతింటుందని సమీర్ వాంఖడే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం దావాను న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ సిరీస్‌లో తన పాత్రను తప్పుగా చిత్రికరించారని, దీనివల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపిస్తూ సమీర్ వాంఖడే షారుఖ్ ఖాన్ మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై కేసు వేశారు. పరిహారంగా రూ.2 కోట్లు చెల్లించాలని తన పిటిషన్లో కోరారు. అయితే ఈ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం తాజాగా ఈ దావాను కొట్టేయడంతో సిరీస్ నిర్మాతలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైనప్పటి నుంచి ఈ సిరీస్ అనేక వివాదాల్లో చిక్కుకుంది. గతంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై నటుడు రణ్‌బీర్ కపూర్‌కు వ్యతిరేకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చర్యలు తీసుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడే అధికారిగా వ్యవహరించడం, ఆ తర్వాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్‌పై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా తీర్పుతో ఈ వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.