సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు హాజరు అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సందడి చేయగా, ఆ షో నేడు ప్రసారం కానుంది. ఇక బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలోను మహేష్ బాబు పాల్గొనబోతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తుంది. దీనిపై తాజాగా పూర్తి క్లారిటీ వచ్చేసింది.
నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే బాలయ్య డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుతో ఓ ఎపిసోడ్‌ను నాచురల్ స్టార్ నానితో మరో ఎపిసోడ్లను పూర్తి చేసి అందరిని మైమరిపించారు. బ్రహ్మానందం, అనీల్ రావిపూడితో కూడా సందడి చేయగా, ఆ ఎపిసోడ్ శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. మహేష్ బాబుకి సంబంధించిన ఎపిసోడ్ శనివారం షూటింగ్ జరుపుకుంది.
ఈ క్రమంలో మహేష్ బాబు, బాలకృష్ణ లొకేషన్ పిక్స్ బయటకు వచ్చాయి. ఇందులో బాలకృష్ణ చేతికి కట్టు తీసేసి కనిపించారు. ఇక మహేష్ ఎప్పటిలాగే చాలా హ్యాండ్సమ్గా దర్శనమిచ్చారు. బాలకృష్ణతో మృదుభాషి అయిన మహేష్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, బాలకృష్ణ నటించిన అఖండ సినిమా చూసిన అనంతరం మహేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘అఖండ భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయ్యిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుతో పాటు అఖండ టీంకు అభినందనలు’ అంటూ మహేశ్‌బాబు తన ట్వీట్ లో పేర్కొన్నాడు.