‘అతడు’ సినిమా ఆరోజుల్లో థియేట్రికల్ పరంగా అంతగా ఆడలేదు. కానీ బుల్లితెరపై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం వేసిన సెట్‌ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా చాలా డబ్బులొచ్చాయి. మా బ్యానర్లో 2005 ఆగస్ట్ 10న ‘అతడు’ చిత్రాన్ని రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్ట్ 9న మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా టెక్నాలజీపరంగా అప్డేట్ చేసి రీరిలీజ్ చేస్తున్నాం’ అన్నారు చిత్ర నిర్మాత మురళీమోహన్.
జయభేరి ఆర్ట్స్ పతాకంపై మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘అతడు’ చిత్రం ఆగస్ట్ 9న రీరిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మురళీమోహన్ మాట్లాడారు. తమ సంస్థకు ‘అతడు’ సినిమా చాలా ప్రత్యేకమని, మహేష్‌బాబు, త్రివిక్రమ్ డేట్స్ ఇస్తే తమ బ్యానర్లో ‘అతడు’ సీక్వెల్‌ను తీయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్‌బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్, జయభేరి ఆర్ట్స్ ప్రియాంక దుగ్గిరాల పాల్గొన్నారు.