ఓ స్టార్ హీరో, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే సహజంగానే భారీ అంచనాలు ఏర్పడుతుంటాయి. ఇలా టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రాబోతున్నది మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబో మూవీ. మహేష్ నటిస్తున్న 29వ చిత్రమిది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న వీరి సినిమా…మరికొద్ది నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం మహేష్29 ఆయన పుట్టినరోజైన ఆగస్టు 9న లాంఛనంగా ప్రారంభంకానున్నట్లు తెలుస్తున్నది. ఆ రోజున చిత్రాన్ని మొదలుపెట్టి… పూర్వ నిర్మాణ పనులు పూర్తయ్యాక రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంగా సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. బాలీవుడ్ తార దీపికా పడుకోన్ నాయికగా నటించనుందని సమాచారం. ఈ సినిమాను ప్రాంఛైజీలుగా తెరకెక్కించే ఆలోచన కూడా ఉన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో కథా రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ చిత్రంలో నటిస్తున్నారు.