ప్రస్తుతం దేశంలో నిర్మితమవుతున్న పాన్ వరల్డ్ సినిమాల్లో ‘SSMB 29’ అగ్రభాగంలో ఉంటుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా విఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడమే ఈ హైప్‌కు కారణం. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతున్నది. ఈ షెడ్యూల్‌కు చెందిన ఆసక్తికరమైన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ చేతుల మీదుగా విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి.
కానీ దానితోపాటు అంతకు మించిన ట్రీట్ ఇచ్చేందుకు రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నారని వినికిడి. ఫస్ట్ లుక్‌తోపాటు ఫస్ట్ గ్లింప్స్‌ని, అలాగే రిలీజ్ డేట్‌ను కూడా ఆ రోజే ప్రకటిస్తారట. భూమండలంపై సినిమాకు ప్రాధాన్యతనిచ్చే ప్రతి దేశంలో, అలాగే.. ప్రపంచంలో సినిమా రూపొందే ప్రతి భాషలోనూ ‘SSMB 29’ విడుదలయ్యేలా వ్యూహాన్ని రచిస్తున్నారు రాజమౌళి. దీనికోసం వివిధ దేశాల ప్రతినిథులతో కూడా ఆయన మాట్లాడుతున్నారని సమాచారం.
మొత్తానికి నవంబర్‌లో ప్రపంచ సినిమాకే చర్చనీయాంశంగా ‘SSMB 29’ నిలువనున్నది. ప్రియాంక చోప్రా కథానాయిక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్లతోపాటు పలు హాలీవుడ్ ప్రముఖులు కూడా నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.