ప్రపంచవ్యాప్త సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘SSMB 29’. శనివారం పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదోఒక అప్డేట్ని ఫ్యాన్సంతా ఆశించారు. వారి ఎదురు చూపుల్ని దృష్టిలో పెట్టుకొని ఓ క్యూట్ అప్డేట్ని డైరెక్టర్ రాజమౌళి పోస్ట్ చేశారు. మహేష్ ఛాతి మాత్రమే కనిపించేలా ఉన్న ఓ ఇమేజ్‌కి, ‘Globe trotter’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించి తన ఎక్స్‌లో పోస్ట్ చేశారాయన. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ఇందులో హీరో ప్రపంచ యాత్రికుడని పరోక్షంగా చెప్పేశారు రాజమౌళి. ఛాతి కనిపించేలా భిన్నంగా డిజైన్ చేయబడ్డ ఓ షర్ట్.
మెడ నుంచి ఛాతిపై జారుతున్న రక్తం. మెడలో కరుంగళీ మాల. దానికి నంది, త్రిశూలం, శివనామంతో కూడిన లాకెట్. చూడగానే గూజ్బంప్స్ కలిగించేలా ఈ లుక్ ఉంది. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. ‘ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. మా సినిమాపై మీ అందరి ఆసక్తి చూస్తే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ రోజు మహేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీకోసం ఈ కొసరు స్టిల్. ఇక అసలు స్టిల్ నవంబర్‌లో విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇందులో మహేష్ కనిపిస్తారు. చాలా భారీగా ఈ సినిమా రానుంది. ప్రెస్మీట్లు పెట్టి, ఇమేజ్‌లు విడుదల చేయడం వల్ల కథకు న్యాయం చేయలేం. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నా.’ అని పేర్కొన్నారు.
ఇన్నాళ్లకు రాజమౌళి నుంచి అప్డేట్ రావడంతో మహేష్ అభిమానులంతా సంబరపడిపోతున్నారు. పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఈ హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇదిలావుంటే.. రాజమౌళి పోస్ట్‌పై తాజాగా మహేష్ కూడా స్పందించారు. ‘ ‘SSMB29’లో నా లుక్ కోసం మీలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నవంబర్‌లో మీతోపాటు నేనూ ఎంజాయ్ చేస్తా.’ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దక్షిణాఫ్రికాలో జరుగనున్నది. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.