మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ హంగులతో ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమాన్ స్ఫూర్తితో హీరో క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 9న మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాతే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న అడ్వెంచర్ కథ కావడంతో ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.