Mahesh Babu | మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఎక్కువగా బీడీలు కాలుస్తూ కనిపించారు మహేష్‌బాబు. స్వతహాగా ఆయన ధూమపానాన్ని ప్రోత్సహించరు. అయితే ‘ఒక్కడు’, ‘పోకిరి’లాంటి చిత్రాల్లో మాత్రం క్యారెక్టర్ డిమాండ్ మేరకు సిగరెట్లు ఊదారు. ‘గుంటూరు కారం’ సినిమా ఆసాంతం బీడీలు తాగుతూ కనిపించారు. ఈ సినిమా ఊర మాస్ ఎంటర్టైనర్. గుంటూరు రమణగా మాస్ పాత్రలో కనిపించారు మహేష్‌బాబు. మాస్ ఇంపాక్ట్ కోసం ఆయన బీడీలు కాల్చక తప్పలేదు. తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలను మహేష్‌బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
“నా గత చిత్రాలకు భిన్నంగా ఇందులో డ్యాన్స్ మూమెంట్స్ ఉండాలని ముందునుంచే నేను, డైరెక్టర్ అనుకొని రమణ పాత్రకు అనుగుణంగా పాటలను డిజైన్ చేసుకున్నాం. నేను స్మోకింగ్‌ను అస్సలు ప్రోత్సహించను. అయితే సినిమాలో నేను బీడీ కాల్చడం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు చెబుతా. అవి ఆయుర్వేదిక్ బీడీలు. లవంగం ఆకులతో తయారుచేశారు. షూటింగ్ ప్రారంభంలో నాకు ఒరిజినల్ బీడీలే ఇచ్చారు. అవి కాల్చినప్పుడు మైగ్రేన్ వచ్చి తల తిరిగిపోయేది. ఆ నొప్పి భరిస్తూ షూటింగ్లో పాల్గొనడం నా వల్ల కావటంలేదని త్రివిక్రమ్‌కు చెప్పా. ఆ మరుసటి రోజు నుంచి సెట్ వాళ్లు ఆయుర్వేదిక్ బీడీలు తయారు చేసి తీసుకొచ్చారు. అందులో ఎలాంటి తంబాకు ఉండదు. మింట్ ఫ్లేవర్‌లో ఉండటంతో సౌకర్యవంతంగా షూటింగ్ చేసేందుకు వీలైంది. రోజూ షూటింగ్ అయిపోయాక వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసి భద్రపరిచేవారు” అని అసలు విషయం చెప్పుకొచ్చారు సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.