దైవత్వానికి, దుష్టశక్తికి మధ్య జరిగే సమరం నేపథ్యంలో రూపొందిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులు. బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా కీలక పాత్రధారి. నవంబర్ 7న విడుదలకానుంది. శుక్రవారం అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. పురాతన కాలంలో సంపదను కాపాడటానికి వేసే పిశాచ బంధనం అనే మంత్రాన్ని ఒకరి అత్యాశ కారణంగా ఓ ఘోస్ట్ హంటర్ బ్రేక్ చేస్తాడు.
దీంతో ధనపిశాచ శాపగ్రస్త దయ్యం మేల్కొంటుంది. దీంతో ఘోస్ట్ హంటర్ ఆ దుష్టశక్తిని అడ్డుకోవడానికి బయలుదేరుతాడు. ఈ నేపథ్యంలో చోటుచేసుకునే ఉత్కంఠభరితమైన సంఘటనలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. ధనపిశాచి పాత్రలో బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా అభినయం ప్రధానాకర్షణగా నిలిచింది. హీరో సుధీర్‌బాబు సరికొత్త మేకోవర్‌తో కనిపించారు. జీ స్టూడియోస్, ఎస్కే ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.