Varanasi Shooting | మహేశ్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్ర షూటింగ్ మరో నాలుగు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారానికల్లా పూర్తిగా ముగియనుందని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన ఒక అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణతో పాటు వారణాసిలోని ముఖ్యమైన భాగాల షూటింగ్ కూడా ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం కేవలం కథను అనుసంధానం చేసే చిన్న చిన్న సన్నివేశాలను మాత్రమే తెరకెక్కిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో రూపొందించడంపై రాజమౌళి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కథ ఐమాక్స్ స్క్రీన్‌పై చూస్తేనే అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని తాము ముందుగానే భావించామని, అయితే ఈ ఫార్మాట్ కోసం కథలో ఎలాంటి ప్రధాన మార్పులు చేయలేదని కేవలం సాంకేతిక పరమైన సర్దుబాట్లు మాత్రమే చేశామని తెలిపారు. సాధారణంగా మన కళ్లు సినిమా స్కోప్ ఫార్మాట్‌కు అలవాటు పడ్డాయని, అందువల్ల అటు ఐమాక్స్, ఇటు సినిమా స్కోప్ రెండింటికీ సరిపోయేలా ‘అనోమార్ఫిక్ ఫ్రేమింగ్’ పద్ధతిని ఉపయోగించి దృశ్యాలను చిత్రీకరించినట్లు వివరించారు. దీనికోసం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆ తర్వాత పని చాలా సులభంగా సాగిపోయిందని జక్కన్న చెప్పుకొచ్చారు. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.