దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని చాలామంది ‘జక్కన్న’ అని అభిమానంతో పిలుస్తుంటారు. సినిమాను శ్రద్ధగా సమయం తీసుకొని మరీ చెక్కుతారు కాబట్టే ఆయనకు ఆ పేరొచ్చిందని చెబుతుంటారు. అయితే.. తన గత చిత్రాలకు భిన్నంగా ‘వారణాసి’ షూటింగ్‌ని మాత్రం శరవేగంతో పూర్తి చేస్తున్నారు రాజమౌళి. ప్రీ విజువలైజేషన్, షెడ్యూల్ ప్లానింగ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగం.. తదితర అంశాల వల్లే షూటింగ్లో వేగం పెరిగిందని చిత్రబృందం చెబుతున్నది.
ఇటీవలే కాశీలో జరిగిన షెడ్యూల్లో అండర్ వాటర్ సీక్వెన్స్‌ని పూర్తి చేసిన రాజమౌళి.. తాజా హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్లో ఓ పాటను షూట్ చేస్తున్నట్టు సమాచారం. గ్లోబల్ లెవల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఈ పాట కథలోని విజువల్ టర్నింగ్ పాయింట్‌గా ఉంటుందని ఇన్సైడ్ టాక్.
చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు, కథానాయిక ప్రియాంకచోప్రాతో పాటు కీలక తారాగణం ఈ పాటలో భాగమయ్యారని వినికిడి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా విడుదల కానున్నది.