Mahesh Babu | ఇటీవలి కాలంలో అభిమానుల చేష్టలు అంతుపట్టకుండా ఉన్నాయి. అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే పనులు కొందరికి సర్ప్రైజింగ్గా అనిపిస్తున్నాయి. డైహార్ట్ ఫ్యాన్స్ ఒంటిపై తమ అభిమాన హీరో పేరు లేదా ఫొటో పచ్చబొట్టు పొడిపించుకోవడం, ఫ్యాషన్ ఫాలో అవ్వడం, పాదయాత్రలు చేయడం, విగ్రహాలు పెట్టి గుడి కట్టి పూజించడం వంటివి చేస్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ అభిమాని అయితే తన పంట పొలంలో చరణ్ ముఖం ఆకారంలో వరి పంట పండించి ఆ ధాన్యం మొత్తం కూడా రామ్ చరణ్‌కి బహుమతిగా ఇచ్చాడు.
ఇంకొందరు ఫ్యాన్స్ తమ పెళ్లి పత్రికలపై అభిమాన హీరోల ఫొటోలు ప్రింట్ చేయించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా సార్లు ఆయన ఫొటోని పెళ్లి కార్డ్‌పై ప్రింట్ చేయించుకున్నారు. ఇక ఇప్పుడు ఓ అభిమాని అయితే ఏకంగా తన పెళ్లి పత్రికపై మహేష్ బాబు ఫోటో వేయించి షాక్ ఇచ్చాడు.కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తి మహేశ్ బాబుకు వీరాభిమాని కాగా, ఆయన మహేశ్ బాబు ఫ్యాన్ క్లబ్లో చురుగ్గా ఉంటున్నాడు. మహేష్ బాబు సినిమా విడుదలైనా, పుట్టిన రోజైనా లేదా ఇతర సందర్భం ఏదైన కూడా మహేష్ బాబుపై ఏదో రకంగా అభిమానం చాటుకుంటూనే ఉన్నాడు.
ఇక ఇప్పుడు ఏకంగా తన పెళ్లి కార్డుపై తన అభిమాన హీరో ఫొటో ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుండగా, దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఫస్ట్ షెడ్యుల్ షూటింగ్ ఒరిస్సాల్ కంప్లీట్ కాగా, మే మొదటి వారం నుండి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సుమారుగా నెల రోజుల పాటు భారీ యాక్షన్ సన్నివేశాలని రాజమౌళి చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యుల్ లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.