Mahesh Babu | సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన మహేష్ బాబు, తొలి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్రశ్రేణి స్టార్స్‌లో ఒకరిగా తన స్థానం పటిష్టం చేసుకున్నాడు మహేష్. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’తో ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించేందుకు సన్నద్ధమవుతున్నారు. పురాణాల నేపథ్యంతో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ పాత్ర మునుపెన్నడూ కనిపించని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌ను నెక్ట్స్ లెవెల్లో చూపించడానికి రాజమౌళి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
‘వారణాసి’తో వచ్చే ఇమేజ్ను నిలబెట్టుకోవడానికి తన తదుపరి కెరీర్ ప్లాన్‌ను మహేష్ అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ నుంచి పలువురు టాప్ డైరెక్టర్లు మహేష్ కోసం కథలు సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుతం ఆయన ఎవరి కథనూ వినట్లేదని తెలిసింది. ఇదిలా ఉండగా, ఒకప్పుడు సందీప్ రెడ్డి వంగా – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తుందని అనుకున్నా కూడా ఆ సినిమా అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, మహేష్ కోసం గతంలో చెప్పిన కథను మళ్లీ తీసుకొచ్చినట్లు సమాచారం.
మహేష్ ,ఆయన భార్య నమ్రత కలిసి ఆ కథను పూర్తిగా చర్చించి, మహేష్ ఇమేజ్‌కి ఇది బాగా సరిపోతుందని భావించినట్టు తెలుస్తోంది. దీంతో సందీప్‌ను పిలిపించి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.రాజమౌళి – మహేష్ కాంబినేషన్లో వస్తున్న ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండగా, దాని తరువాత వచ్చే మహేష్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ సినిమా పై కూడా అదే స్థాయి బజ్ ఉండడం ఖాయం. సందీప్ రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అయినప్పటికీ, మహేష్ వంటి స్టార్ హీరో స్థాయిలో కథను మలచడం పెద్ద సవాలే అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, మహేష్ బాబు కెరీర్లో రాబోయే రెండు సినిమాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అన్నది మాత్రం నిజం.