Multiplex | హైదరాబాద్ సినిమా ప్రియులకు మరో పండుగలాంటి వార్త. సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యంతో ఏషియన్ సినిమాస్ రూపొందించిన AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌కు ఇప్పటికే బ్రాండ్ వాల్యూ ఏర్పడింది. ఇప్పుడు అదే ఘనతను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా, RTC క్రాస్ రోడ్స్ లో మరో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుపుతున్నారు. AMB Cinemas – ఫేజ్ 2గా రూపొందుతున్న ఈ థియేటర్ నిర్మాణం ప్రస్తుతం తుదిదశకు చేరిందని, ఇంటీరియర్ వర్క్ వేగంగా జరుగుతుందని సమాచారం. 2026 సంక్రాంతి సీజన్‌కి ఈ మల్టీప్లెక్స్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏషియన్ సినిమాస్, మహేష్ బాబు టీం చకచకా పనులను పూర్తి చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కొత్త AMB మల్టీప్లెక్స్‌లో 7 భారీ స్క్రీన్లు ఉండనున్నాయని, అందులో ప్రతీ స్క్రీన్ అత్యాధునిక ప్రాజెక్షన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్, ప్రీమియం సీటింగ్, ఎలివేటెడ్ విజువల్ అంబియన్స్తో రూపొందించబడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న గచ్చిబౌలి ఏఎంబీ సినిమాస్‌కి మించి, మరింత అద్భుతమైన అనుభూతి అందించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభ వేడుకకు సంబంధించి ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతి 2026లో విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా ఈ థియేటర్లో తొలిసారిగా స్క్రీనింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంక్రాంతి సీజన్లో ఈ మల్టీప్లెక్స్ 30-40 షోలు వేశాక, ఒక్క సినిమా నుంచే కోటి రూపాయల పైగా వసూళ్లు రావచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో మహేష్ బాబు థియేటర్ జర్నీలో మరో అద్భుతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో సినిమాలకి గుండెకాయగా పేరొందిన RTC క్రాస్ రోడ్స్ ప్రాంతంలోనే ఈ కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం జరగడం విశేషం. ఇప్పటికే ఉన్న ప్రముఖ థియేటర్లకు గట్టి పోటిగా ఈ బ్రాండ్ నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.