శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహావీరుడు’. మడోన్ అశ్విన్ దర్శకుడు. అరుణ్ విశ్వ నిర్మాత. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ ‘ఫాంటసీ జోనర్ చిత్రమిది.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది. వారిని ఆశ్చర్యపరిచే అంశాలెన్నో ఉంటాయి. తప్పకుండా థియేటర్లో చూడాల్సిన చిత్రమిది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అన్నారు. ‘ఈ సినిమాలో శివ కార్తికేయన్లోని యాక్షన్ కోణం చూస్తారు. సునీల్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రను పోషించారు. వైవిధ్యమైన కథతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరూ స్పృశించని వినూత్న కథాంశమిదని సీనియర్ నటి సరిత చెప్పారు. ఈ సినిమా ట్రైలర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అతిథులుగా విచ్చేసిన శేఖర్ కమ్ముల, అడివి శేష్ ప్రశంసించారు.